దేశవ్యాప్తంగా ఎక్కడో చోట అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్న క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు ఏర్పడ్డాయి. గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఇలా ఏదో రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం తలెత్తుతోంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కూడా అల్లర్లు చెలరేగాయి. హుబ్లీ నగరంలో రాళ్ల దాడి జరిడింది. ఓల్డ్ హుబ్లీ పోలీస్ స్టేషన్ పై శనివారం రాత్రి ఓ వర్గానికి చెందిన గుంపు రాళ్ల దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ ముందు గుమిగూడిన గంపు ఒక్కసారిగా రాళ్ల దాడి చేసింది… పోలీస్ వాహనాలను ధ్వంసం చేసింది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ను ప్రయోగించి చెదరగొట్టారు. వాట్సాప్ లో అభ్యంతరకర స్టేటస్ పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు… ఈక్రమంలోనే రాళ్లదాడి కూడా చోటు చేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో హుబ్లీ అంతటా 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.