దేశానికే దిక్సూచిలా, సమానత్వ స్ఫూర్తిని నిత్యం రగిలించేలా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం కొలువుదీరింది. రాజ్యాంగ నిర్మాత 132వ జయంతి వేళ 125 అడుగుల కాంస్య విగ్రహం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం.. జై భీమ్ అనే నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంబేడ్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటిందని గుర్తు చేశారు.
అంబేడ్కర్ పేరిట అవార్డు ఇవ్వాలని కత్తి పద్మారావు సూచించారని ముఖ్యమంత్రి కేసీఆర్ సభా వేదికగా తెలిపారు. వచ్చే ఏడాది నుంచి అంబేడ్కర్ జయంతి రోజున ఆ మహనీయుడి పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వబోతోందని ప్రకటించారు. అవార్డు కోసం రూ.51 కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఎస్సీల అభ్యున్నతి కోసం తెచ్చిన కార్యక్రమం దళితబంధు అని కేసీఆర్ అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 50 వేల మందికి దళితబంధు అందిందని తెలిపారు. ఈ ఏడాది మరో 1.25 లక్షల మందికి దళితబంధు అమలు చేస్తామని వెల్లడించారు.