షెడ్యూల్ ప్రకారం ఆగస్టులోనే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని.. పోరుకు రెడీగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని.. కాస్త కష్టపడితే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, నేతలంతా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
‘నేతలందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. పార్టీలోని అన్ని స్థాయిల నేతలను కలుపుకునిపోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మరింత చొరవ చూపాలి. వీలైనంత వరకు నేతలంతా ప్రజాక్షేత్రంలోనే ఉండాలి. త్వరలో వరంగల్లో భారీ బహిరంగ సభ.’-సీఎం కేసీఆర్
ముందస్తు ఎన్నికలు ఉండవని సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు కార్యకర్తలే బలమని, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల కోడ్ అనంతరం మిగిలి ఉన్న రెండు పడకల గదుల ఇండ్ల పంపిణీ పూర్తి చేయాలని, 58,59 జీవోల కింద క్రమబద్దీకరణ దరఖాస్తు గడువు పెంపును పేద ప్రజల కోసం సద్వినియోగపరుచుకోవాలని సూచించారు.