ఈటల రాజేందర్ ( Etela Rajender ) రాజీనామా ప్రభావమో….లేక హుజూరాబాద్ ప్రజల అదృష్టం ఏమో తెలియదు గానీ, సీఎం కేసీఆర్ మాత్రం హుజూరాబాద్‌పై ఊహించని విధంగా వరాలు కురిపిస్తున్నారు. భూ కబ్జా ఆరోపణలు రావడంతో ఈటలని మంత్రి వర్గం నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఈటల వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక ఇక్కడ నుంచే అసలు రాజకీయం మొదలైంది. హుజూరాబాద్‌లో బలంగా ఉన్న ఈటలని ఓడించేందుకు కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఊహించని విధంగా హుజూరాబాద్‌పై వరాలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా దళిత బంధు పేరిట నియోజకవర్గంలోని దళిత ఓటర్లని ఆకట్టుకునేందుకు వేల కోట్లు ఖర్చు పెట్టనున్నారు.
అటు బీసీలని ఆకట్టుకునేందుకు పలు స్కీంలు ఇస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తున్నారు. పింఛన్ల వయో పరిమితి తగ్గించారు. అటు రుణమాఫీలోనూ కదలిక వచ్చింది. ఇప్పటి వరకూ రూ.25వేలలోపు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు రూ.50వేలలోపు రుణాల మాఫీ చేయడానికి సిద్ధమైంది. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేయడానికి రెడీ అయ్యారు. ఇలా ఒకటి ఏంటి అనేక రకాలుగా హుజూరాబాద్ ఉపఎన్నికని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ పథకాలు అందించడానికి సిద్ధమవుతున్నారు.
అలాగే హుజూరాబాద్ నియోజకవర్గంలో వందల కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నారు. అయితే కేసీఆర్ ఈ విధంగా చేయడానికి కారణం మాత్రం ఈటల రాజేందర్ అనే ప్రజలు భావిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఉపఎన్నిక రావడంతోనే కేసీఆర్ భారీ ఎత్తున పథకాలు అందించడానికి సిద్ధమవుతున్నారని, కాబట్టి ఇదంతా ఈటల వల్లే అని హుజూరాబాద్ ప్రజలు గట్టిగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికైతే కేసీఆర్ పథకాలు ఈటలకే ప్లస్ అయ్యేలా ఉన్నాయి.