అధికారంలోకి రావడం బీఆర్ఎస్ పార్టీ ధ్యేయం కాదని.. దేశ పురోగమనాన్ని మార్చడమే తమ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో 24 గంటల విద్యుత్ ఇచ్చి వెలుగుల భారత్‌ను చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తామన్న ఆయన.. దేశంలోని ప్రతీ ఎకరాకి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మహోజ్వల భారత్ నిర్మాణమే భారాస లక్ష్యమని చెప్పారు. మేకిన్ ఇండియా అయితే.. పేటకో చైనా బజార్లు ఎందుకుంటాయని.. భారత్ బజార్‌లు ఎక్కడున్నాయని కేసీఆర్ ప్రశ్నించారు.
దేశంలో వ్యవసాయ భూమి, విద్యుత్, నీరు, మానవ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ.. రైతులు దేశరాజధానిలో రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని కేసీఆర్ ప్రశ్నించారు. దేశ ప్రజలు ముఖ్యంగా యువత ఆలోచించాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశమంతటా 24 గంటల నిరంతర విద్యుత్, ప్రతీ ఎకరా భూమికి సాగునీరు సహా దళిత బంధు అమలు చేస్తామని కేసీఆర్ వివరించారు.