గ్రేటర్ ఎన్నికల వేళ.. హైదరాబాద్ మహానగరంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనలోనూ, ప్రచారంలోనూ దూకుడుగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో అలకలు ఇప్పట్లో ఆగేలా లేవు. స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ సైతం తమ పార్టీ తీరుపై రగిలిపోతున్నారంటే ఆ పార్టీలో ముసలం ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. ఇక నామినేషన్ల దాఖలుకు ఈ రోజే చివరి రోజు కావడంతో అన్ని పార్టీల మిగిలిన డివిజన్లకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నాయి.
ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికల వేళ అధికార పార్టీ కారు జోరుకు వరుసగా బ్రేకులు పడుతున్నాయి. ఇప్పటికే దుబ్బాకలో ఊహించని విజయంతో బీజేపీ శ్రేణులు తిరుగులేని జోష్‌తో ఉన్నాయి. అదే ఊపు బీజేపీ ఇక్కడ కూడా చూపిస్తోంది. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్‌లో ఒక్కసారిగా అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. కేసీఆర్ 90 శాతం డివిజన్లలో పాత వాళ్లకే టిక్కెట్లు కేటాయించారు. ఈ ప్లాన్ ఇప్పుడు రివర్స్ అయ్యింది. దీంతో కొత్త ఆశావాహులు ఇతర పార్టీల్లోకి కొందరు జంప్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం రెబల్స్‌గా రంగంలో ఉండి టీఆర్ఎస్ అభ్యర్థులనే ఓడిస్తామంటూ సవాళ్లు రువ్వుతున్నారు.
ఇక సీట్లు రాని సిట్టింగ్‌లకు బీజేపీ సీట్లు ఇస్తుండడంతో వాళ్లు కూడా పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. అన్ని పార్టీల కంటే టీఆర్ఎస్‌లోనే ఎక్కువ మంది సీట్లు ఆశించి అసంతృప్తితో ఉండడంతో వారంతా బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసేసింది. టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి సిట్టింగ్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరగా… ఇప్పుడు మరో కార్పొరేటర్ కూడా కాషాయ కండువా కప్పేసుకున్నారు. వెంగళరావు నగర్ కార్పొరేటర్ కిలారు మనోహర్‌ను టీఆర్ఎస్ పక్కన పెట్టడంతో ఆయన కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిపోయారు.
ఇక బీజేపీ టీఆర్ఎస్ నుంచే కాకుండా కాంగ్రెస్ కీలక నేతలను కూడా ఆకర్షిస్తుండడంతో బీజేపీ మరింత స్ట్రాంగ్ అవుతోంది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి దంపతులతో పాటు శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్, ఆయన తనయుడు లాంటి కీలక నేతలు కాషాయ దళంలో చేరిపోయారు. ఏదేమైనా కీలక ఎన్నికల్లో అధికార పార్టీలోకి వలసలు లేకపోగా… అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు జోరందుకోవడంతో టీఆర్ఎస్ కలవరం మొదలైందన్నది వాస్తవం.