మన శరీరానికి కావల్సిన అనేక పోషకాల్లో విటమిన్ డి కూడా ఒకటి. ఇది మనకు సూర్య రశ్మి ద్వారా లభిస్తుంది. నిత్యం కాసేపు సూర్యరశ్మిలో శరీరం తగిలేలా ఉంటే మన శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. అయితే విటమిన్ డి క్యాప్సూల్స్ రూపంలోనూ లభిస్తుంది. వాటిని నిత్యం వేసుకోవడం వల్ల కోవిడ్ 19, క్యాన్సర్‌లకు చెక్ పెట్టవచ్చని సైంటిస్టులు తెలిపారు.
హార్వార్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నిత్యం కొందరికి విటమిన్ డి క్యాప్సూల్స్ ఇచ్చారు. తరువాత పరిశీలిస్తే వారు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు 17 శాతం వరకు తక్కువగా ఉంటాయని, క్యాన్సర్‌తో చనిపోయే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని తేల్చారు. అలాగే ఆరోగ్యవంతమైన వ్యక్తులు నిత్యం విటమిన్ డి క్యాప్సూల్స్‌ను తీసుకుంటే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 38 శాతం వరకు తక్కువగా ఉంటాయని గుర్తించారు. ఈ పరిశోధనల తాలూకు వివరాలను వారు జామా నెట్‌వర్క్ ఓపెన్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు.
ఇక పీజీఐఎంఈఆర్‌కు చెందిన సైంటిస్టులు కూడా కోవిడ్ 19 నేపథ్యంలో పలు ప్రయోగాలు చేశారు. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న పలువురు కోవిడ్ పేషెంట్లకు వారు నిత్యం అధిక మోతాదులో విటమిన్ డి ట్యాబ్లెట్లను ఇచ్చారు. దీంతో వారిలో కోవిడ్ కారణంగా ఏర్పడే వాపులు చాలా వరకు తగ్గాయని, వారు చాలా త్వరగా కోవిడ్ నుంచి కోలుకున్నారని కూడా గుర్తించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ విటమిన్ డి ఉండే ఆహారాలను తీసుకోవాలని, విటమిన్ డి లోపం ఉంటే డాక్టర్‌ను సంప్రదించి నిత్యం విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడాలని సూచిస్తున్నారు.