కేసీఆర్ వర్సెస్ గవర్నర్..రెండువైపులా రాజకీయమే..!

-

తెలంగాణలో సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళసై  అన్నట్లుగా పోరు నడుస్తోంది. సాధారణంగా గవర్నర్లు రాజకీయ పరమైన అంశాల జోలికి వెళ్లరు. కానీ తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళసై మాత్రం రాజకీయమే చేస్తున్నారని, బీజేపీ ప్రతినిధిగా ఆమె వ్యవహరిస్తున్నారని టి‌ఆర్‌ఎస్ వర్గాల నుంచి ఎప్పటినుంచో విమర్శలు వస్తున్నాయి. ఇక గవర్నర్‌ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని తమిళసై పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఇక గవర్నర్‌గా ఉన్న ఆమె అనేకసార్లు ఫీల్డ్‌లోకి దిగి రాజకీయం చేశారనే విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా గాని సీఎం వర్సెస్ గవర్నర్ అన్నట్లు రాజకీయం నడుస్తోంది. ఇదే తరుణంలో మరొకసారి ప్రభుత్వం, రాజ్‌భవన్‌ల మధ్య రచ్చ మొదలైంది. ఆ మధ్య వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీనికి అసెంబ్లీ, మండలిలో ఆమోదముద్ర వేసుకుని గవర్నర్‌కు పంపారు.

అయితే ఈ బిల్లు వల్ల వర్శిటీలపై ప్రభుత్వం పెత్తనం పెరుగుతుందనే విమర్శలు వచ్చాయి. ఇదే క్రమంలో గవర్నర్..ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయలేదు. ఈ క్రమంలోనే గవర్నర్‌పై ఒత్తిడి పెంచేందుకు..ప్రగతిభవన్ వర్గాలు సిద్ధమయ్యాయని, బిల్లుకు ఆమోదముద్ర వేయాలనే డిమాండ్‌తో పలు వర్శిటీల్లో తమకు అనుకూలంగా ఉన్న విద్యార్ధి సంఘాలతో రాజ్‌భవన్ వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు టి‌ఆర్‌ఎస్ సిద్ధమైందని తెలిసింది.

ఈ విషయం రాజ్‌భవన్ వర్గాలు పసిగట్టి..ముందుగానే అలెర్ట్ అయి..విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బిల్లుపై చర్చేందుకు రావాలని గవర్నర్ లేఖ పంపినట్లు తెలిసింది. 8 ఏళ్లుగా ఖాళీలని ఎందుకు భర్తీ చేయలేదు? పాత పద్ధతిలో భర్తీ చేస్తే ఏమన్నా ఇబ్బందులు వస్తాయా? కొత్త విధానం లీగల్ సమస్యలు వస్తాయా? అని లేఖలో గవర్నర్..ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇవేగాక ఇంకా ఏడు బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.

అయితే ఈ అంశంపై సబితా సీరియస్‌గా స్పందించారు. రాజ్ భవన్ నుంచి తనకు ఎలాంటి లేఖ అందలేదని, యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు గురించి గవర్నర్ లేఖ రాశారని మీడియా, సోషల్ మీడియాలో మాత్రమే చూశానని చెప్పారు. ఇలా ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ అన్నట్లు పోరు నడుస్తోంది. చూస్తుంటే రెండువైపులా రాజకీయం ఉన్నట్లే కనిపిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news