అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేశ్..తెలుగు చిత్ర సీమకు ‘నేను శైలజ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. ఈ క్రమంలోనే ‘మహానటి’ పిక్చర్ లో నటించి జాతీయ అవార్డు అందుకుంది. ఇక ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల్లో పలు చిత్రాలు చేసిన కీర్తి సురేశ్.. తన ‘కీర్తి’ని చాటుకుంటూ స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ప్రజెంట్ ఈ భామ స్టార్ హీరోయిన్ గా వరుసగా పలు చిత్రాల్లో నటిస్తోంది. అయితే, ఈమె సినిమాలపైన గత చిత్రాల ప్రభావం పడకపోవడం విశేషం. ‘పెంగ్విన్, మిస్ ఇండియా, రంగ్ దే, అన్నాత్తె, మరక్కర్, గుడ్ లక్ సఖి’ వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ కీర్తి సురేశ్ నటించే సినిమాల జాబితాపైన ప్రభావం పడలేదు.
వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ ముందుకొచ్చాయి. ఆమె నటించిన చిత్రాలు ‘సర్కారు వారి పాట, సాని కాయిదమ్, వాషి’ త్వరలో విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఆమె ‘భోళా శంకర్, దసరా, మామన్నన్’ చిత్రాల్లో నటిస్తోంది. కీర్తిసురేశ్ ఓ వైపున స్టార్ హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపున కీలక పాత్రలు కూడా పోషిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్తె’ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’గా విడుదలయింది.
ఇందులో రజనీ చెల్లెలిగా కీర్తి సురేశ్ నటించింది. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ పిక్చర్ లోనూ ఈ భామ చిరుకు చెల్లెలిగా నటిస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేశ్ నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం వచ్చే నెల 12న విడుదల కానుంది.