కొండా సురేఖ వ్యాఖ్యల పై కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ

-

రేవంత్‌ రెడ్డి పాదయాత్ర ముగింపు సభలో కొండా సురేఖ ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు సీనియర్లపై పంచ్‌లు.. మరోవైపు రేవంత్‌ రెడ్డిపై పొగడ్తలు సంచలనంగా మారాయి. ఒకవైపు కొండా మురళి.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం ఉంది. మరి ఇలాంటి సమయంలో కొండా సురేఖ.. ఎందుకలా మాట్లాడారు వ్యూహాత్మకంగా వ్యవహరించారా అన్నదాని పై కాంగ్రెస్ లో చర్చ నడుస్తుంది.


వరంగల్ రాజకీయాల్లో కొండా దంపతులకు తమదైన ముద్ర ఉంది. కాలం కలిసిరాక.. కొంతకాలంగా నిస్తేజంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ తెర మీదకు వచ్చేశారు. అదేదో సాదా సీదాగా కాదు సీనియర్లను కడిగేశారు. చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న కొండా ఫ్యామిలీ ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్‌ అవుతోంది. వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలు.. ఎమ్మెల్సీ ఎలెక్షన్స్‌ కూడా దగ్గరలో ఉండటంతో.. కొండా ఫ్యామిలీ యాక్టివేట్‌ అవుతోంది. కొండా మురళీ ఇటీవల గాంధీ భవన్ లో జరిగిన సమావేశాలకు కూడా హాజరయ్యారు. కొండా మురళి.. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారు. అయితే కొండా సురేఖ మాత్రం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన పాదయాత్ర ముగింపు సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్‌ పార్టీ సీనియర్లకు చురకలు అంటించేలా ఉన్నాయి. దీని వెనుక వ్యూహం ఏదైనా ఉందా.. లేదంటే యాధృచ్చికంగా చేసిన కామెంట్స్ ఆ అన్న చర్చ నడుస్తుంది.

కొండా సురేఖ కూడా చాలా జాగ్రత్తగా కామెంట్స్‌ చేసినట్టే కనిపించింది. ఉత్తమ్ కుమార్‌ రెడ్డి పార్టీ కోసం పనిచేశారు కానీ.. ఆయన క్లాస్ లీడర్ అంటూనే… రేవంత్ లాంటి మాస్ లీడర్ ఇప్పుడు కాంగ్రెస్‌కి చాలా అవసరమని చెప్పుకొచ్చారు. ఉత్తమ్ కుమార్‌ రెడ్డిని కాదని, రేవంత్ కి జై కొట్టినట్టు అని కాంగ్రెస్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీ సీనియర్ల మీద ఓ రకంగా ఎటాక్ మొదలుపెట్టినట్టే అనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేతలు పని చేయరు.. చేసే వాళ్ళను చేయనివ్వరు అంటూ కొండా సురేఖ సెటైర్లు వేశారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. రేవంత్ రెడ్డిని వైఎస్సార్‌తో పోల్చడం కొంత మంది సీనియర్లకు జీర్ణించుకోలేని విషయంగా మారింది.

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు..రేవంత్ రెడ్డికి మరింత బలాన్ని ఇచ్చేలా ఉన్నాయన్న ఫిలింగ్‌లో ఉన్నారు సీనియర్లు. కొందరు సీనియర్లు రేవంత్ ని వ్యక్తిరేకిస్తున్నారు. అయితే కేసీఆర్ లాంటి నాయకుణ్ణి ఎదుర్కోవాలంటే.. రేవంత్‌ లాగా వాగ్ధాటి ఉన్న వారు అవసరం అని సురేఖ చెప్పుకొచ్చారు. అయితే కొండా సురేఖ వ్యాఖ్యల వెనక రేవంత్ వ్యూహం ఉంటుందని లెక్కలు వేస్తున్నారు సీనియర్లు. అన్ని జిల్లాల్లో నాయకులను రేవంత్ సిద్ధం చేసుకునే పనిలో భాగంగానే సురేఖను..తన టీంలో చేర్చుకున్నారనే టాక్ మొదలైంది. దీనికి తోడు కొత్త పీసీసీ కార్యవర్గం గనక వస్తే..కొండా సురేఖకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాగూర్ కూడా కొండా సురేఖకు మాటిచ్చారనే ప్రచారం జరుగుతోంది. రైతు పాదయాత్ర సభలో కొండా సురేఖ వ్యాఖ్యలన్నీ కూడా వ్యూహాత్మక అడుగులో భాగమే అంటున్నాయి పార్టీ వర్గాలు. దీనికి తోడు సీనియర్ నాయకులపై సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాయకులు లోలోన కుతకుత లాడుతున్నారే తప్పితే బయటకు గొంతు విప్పే పరిస్థితి మాత్రం కనిపించలేదు.

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల సహజ శైలి ప్రకారమైతే.. ఎప్పుడో మాటల ఎటాక్ మొదలయ్యేది. కానీ సైలెంట్ గా ఉన్నారంటే..ఏదో జరుగుతుందనే వాదన పార్టీ నేతల్లో వినిపిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news