రాజావారు రాణిగారు’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే సినీప్రియుల్ని మెప్పించి.. ‘ఎస్.ఆర్.కల్యాణ మండపం’ తో కమర్షియల్ హీరోగానూ సత్తా చాటారు కిరణ్ అబ్బవరం. ఈ ఏడాది ‘సెబాస్టియన్’ , ‘సమ్మతమే’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. రెండూ పూర్తిగా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విజయమే లక్ష్యంగా ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అంటూ బాక్సాఫీస్ ముందుకొచ్చారు కిరణ్. ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ తర్వాత శ్రీధర్ – కిరణ్‌ల కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రమిది. ఈ సినిమాతోనే నిర్మాతగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు దర్శకుడు కోడి రామకృష్ణ తనయురాలు కోడి దివ్య దీప్తి. మరి పాటలు, ప్రచార చిత్రాలతో అంచనాలను పెంచిన ఈ సినిమా.. థియేటర్లలో ఏమేర సత్తా చాటింది? ఈ చిత్రంతో కిరణ్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడా? నిర్మాతగా కోడి దివ్వ దీప్తికి తొలి అడుగులోనే విజయం దక్కిందా?
కథేంటంటే: తేజు (సంజనా ఆనంద్) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఓ కుర్రాడిని ప్రేమించి మోసపోతుంది. ఇంట్లో వాళ్లకు ముఖం చూపించుకోలేక భారంగా జీవితాన్ని గడిపేస్తుంటుంది. ఈ క్రమంలోనే మద్యానికి బానిసవుతుంది. అలాంటి ఆమె జీవితంలోకి క్యాబ్ డ్రైవర్ వివేక్ (కిరణ్ అబ్బవరం) ఎంట్రీ ఇస్తాడు. తేజు తాగి పడిపోయిన ప్రతిసారీ ఆమెను తన రూంలో డ్రాప్ చేసేది అతనే. ఓసారి ఆమెను ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేయబోతే కాపాడతాడు. దీంతో ఆమెకు వివేక్‌పై మంచి అభిప్రాయం ఏర్పడి.. తన విషాద గాథను అతనితో పంచుకుంటుంది. అదే సమయంలో వివేక్ కూడా తన విఫల ప్రేమకథను ఆమెతో పంచుకుంటాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఇద్దరి ప్రేమకథలకు ఉన్న లింకేంటి? ఒకరి కథ మరొకరు తెలుసుకున్నాక ఇద్దరూ కలిసి ఏం చేశారు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే: వచ్చీ రాగానే కమర్షియల్, మాస్ హీరో ట్యాగ్ తగిలించుకోవడానికి ఈతరం హీరోలు బాగా ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో కమర్షియల్ ఎంటర్‌టైనర్లు, మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ల పేరుతో కథ లేకుండానే అనవసరమైన ప్రయోగాలు చేసి బాక్సాఫీస్ ముందు చతికిలపడుతున్నారు. కిరణ్ గత రెండు సినిమాల విషయంలోనూ ఇలాంటి తప్పులే చేసి.. చేదు ఫలితాలు అందుకున్నారు. అయినా ఇప్పటికీ ఆ పాత చింతకాయపచ్చడి లాంటి రొటీన్ కమర్షియల్ ఫార్ములాను వీడి బయటకు రావడం లేదు. నాలుగు పాటలు.. ఐదు ఫైట్లు.. ఓ ఐటెం గీతం.. పెట్టేసి తెరపై మ్యాజిక్ చేసేస్తానంటే నడిచిపోయే రోజులు కావివి. కథే కింగ్. అది ఎంత కొత్తగా ఉంది.. దాన్ని ఇంకెంత బలంగా తీర్చిదిద్దుకున్నాం అన్న దాన్ని బట్టే చిత్ర ఫలితం ఆధారపడి ఉంటుంది. ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’లో ఈ కొత్తదనం కనిపించదు.
సినిమా మొదలవుతూనే.. ఓ ఐటెం గీతం.. ఆ వెంటనే కథానాయకుడిలోని హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ ఓ యాక్షన్ ఎపిసోడ్.. ఇక ఆ తర్వాత నుంచి హీరో పాత్ర తెర మరుగైపోతుంది. నాయిక తన విఫల ప్రేమకథ చెబుతుంటే అడపాదడపా ఊ కొడుతూ కనిపించడం తప్ప.. ఆ పాత్రలో ఏ మెరుపులూ కనిపించవు. ఇక కథానాయిక ప్రేమకథ విషయానికొస్తే.. అందులోనూ సరైన సంఘర్షణ కనిపించదు. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల ఊహకు తగ్గట్లుగానే సాగుతుంటుంది. విరామానికి ముందు ఆమె ప్రేమకథలో వచ్చే ట్విస్ట్ కాస్త ఆసక్తిరేకెత్తిస్తుంది. ఇక ద్వితీయార్ధమంతా హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో నడుస్తుంది. హీరో ప్రేమకథ మొదలవగానే నాయిక పాత్ర తెర మరుగైపోతుంది. నిజానికి ఈ కథలోనూ ఏమాత్రం కొత్తదనం, ఫీల్ కనిపించవు. బాబా భాస్కర్‌తో కలిసి కిరణ్ చేసే హంగామా మరీ అతిగా అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో వచ్చే ట్విస్ట్.. ‘కృష్ణవంశీ శశిరేఖా పరిణయం’ చిత్రాన్ని గుర్తు చేస్తుంది.
ఎవరెలా చేశారంటే: వివేక్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటన బాగుంది. నిజానికి ఈ చిత్రంలో ఆయన తన నటనపైన కంటే మాస్ ఎలివేషన్లపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే కథను పక్కకు నెట్టి మరీ బలవంతంగా యాక్షన్ ఎపిసోడ్స్ ఇరికించేశారు. వాటిని డిజైన్ చేసిన విధానం బాగున్నా.. అవి కిరణ్ ఇమేజ్‌కు మించిన స్థాయిలో ఉన్నాయి. ఐటెం పాటలో.. నచ్చావబ్బాయ్ గీతంలో కిరణ్ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటాయి. తేజు పాత్రలో సంజనా ఆనంద్ ఫర్వాలేదనిపించింది. వాస్తవానికి కథలోనే సరైన బలం లేకపోవడం వల్ల తెరపై ప్రతి పాత్రా తేలిపోయింది. సోనూ ఠాకూర్, బాబా భాస్కర్, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. శ్రీధర్ గాదె రాసుకున్న కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. కిరణ్ అబ్బవరం అందించిన స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందుకు తగినట్లుగానే ఉన్నాయి. సినిమా మొత్తంలో కాస్త కాలక్షేపాన్నిచ్చింది మణిశర్మ సంగీతం మాత్రమే. అదే చిత్రానికి ప్రధాన ఆకర్షణ. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు
- కిరణ్ నటన
- మణిశర్మ సంగీతం
బలహీనతలు
- పేలవమైన కథ.. కథనాలు
- బలహీనమైన స్ర్కీన్‌ప్లే
రేటింగ్: 2/5