తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండవ లిస్ట్‌పై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దసరా తర్వాత బీజేపీ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రజలు ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. దసరా తర్వాత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.ఈ నెల 27న అమిత్ షా, నెల చివర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలంగాణలో ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మోడీ పాలనను రాష్ట్రంలోని ప్రతిగడపకు తీసుకెళ్తామన్నారు. బీఆర్ఎస్ వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చుకుంటామన్నారు. కుటుంబ, అవినీతి పాలనకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కవలపిల్లలు అని విమర్శించారు.
ఇదిలా ఉంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై దర్యాప్తు జరపాలని కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మూడేళ్లలోనే మేడిగడ్డ బ్రిడ్జి కుంగిపోవడం దారుణమన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు అట్టర్ ఫ్లాఫ్ అయిందని ఆయన సెటైర్లు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు చేసిన ప్రజల సొమ్ము వృధా అయిందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మేడిగడ్డ బ్రిడ్జి కుంగిపోవడంపై ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. డ్యామ్ సేఫ్టీ బిల్లును ఆమోదించి డ్యామ్ సేప్టీ అథారిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఆహ్వానించి ప్రాజెక్టును పరిశీలించాలని ఆయన కోరారు.ఈ విషయమై తాను కూడ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత, భద్రతను పరిశీలించాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీని పంపాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖను కోరుతానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.