కరోనాకి ముందు వలసదారుల గురించి పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. భారతదేశంలోని మొత్తం 29రాష్ట్రాల్లో అటు నుండి ఇటు వెళ్ళేవారు, ఇటు నుండి అటు వెళ్ళేవారు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పనికోసం మరో చోటుకి తరలి, అక్కడి వాతావరణానికి నిలబడి, వారి పనుల్లో పాలుపంచుకుని, అభివృద్ధిలో చేయూతనందిస్తూ, తమకి కావాల్సింది అందుకుంటూ సాగిపోయే వలసదారులకి దినోత్సవం ఉన్నదన్న సంగతి చాలా మందికి తెలియదు.
ప్రతీ యేటా డిసెంబరు 18వ తేదీన అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున వలసదారుల సమస్యలు, వలస ప్రదేశల్లో ఉండే ఇబ్బందులు మొదలగు విషయాలపై అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వలస వచ్చిన వారిని అక్కడ ఉన్న జనాలు చులకనగా చూస్తుంటారు. కానీ నిజం చెప్పాలంటే వలసల వల్లే అభివృద్ధి జరుగుతుంది. చరిత్ర చూసుకున్నా అంతే. అమెరికాలో వలసదారులు ఎక్కువగా ఉంటారు. అందువల్లే అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగింది.
ఎక్కడైతే వలస ప్రజలు ఎక్కువ మంది చేరతారో అక్కడ అభివృద్ధి జరుగుతున్నట్టు లెక్క. పట్టణాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడానికి పల్లెల్లో తక్కువగా ఉండడానికి కారణం కూడా అదే. ఒకప్పుడు దుబాయ్ ఎలా ఉండేదో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అదే దుబాయ్ ప్రపంచంలోనే మేటి పర్యాటక కేంద్రంగా మారిపోయింది. దానికి కారణం వలస కూలీలే. పొట్ట చేతపట్టుకుని వలస వచ్చేది వారు బ్రతకడానికి మాత్రమే కాదు, మరొకరిని బ్రతికించడానికి కూడా.
ప్రస్తుతం కూలీలు లేక ఎన్ని పనులు ఆగిపోయాయో చెప్పాల్సిన పనిలేదు. కార్ఖానాల్లో ఎక్కడి పని అక్కడే ఉంది. అందుకే వలస వెళ్ళిపోతున్న వారిని చులకనగా చూడవద్దు. వారికోసం ఎదురుచూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు.