సంక్రాంతి తరువాత గుడివాడ వీధులు వివాదాలతో భగ్గు మంటున్నాయి.పూటకో మాట రోజుకో పజ్యెం అందుకుంటున్నాయి. విమర్శలు,ప్రతివిమర్శలు రూపంలో మీడియా పాయింట్లు అన్నీ దద్దరిల్లి దడ పుట్టిస్తున్నాయి.
మంత్రి కొడాలి నాని కి చెందిన కే కన్వెషన్ హాల్ లో పండగ సందర్భంగా క్యాసినో నిర్వహించారన్న ఆరోపణలపై అటు టీడీపీ,ఇటు వైసీపీ భగ్గు మంటున్నాయి.తనకు చెందిన ఫంక్షన్ హాల్ లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించారని నిరూపిస్తే ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి పెను సంచలనమే రేపారు నాని.
ఇదే సమయంలో చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తన ఇగోను సాటిస్ఫై చేసుకున్నారు. మరోవైపు నిజ నిర్థారణ పేరిట టీడీపీ కూడా చాలా హడావుడినే చేసింది. మంత్రి నానిపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు తాను సిద్ధమేనని బోండా ఉమా అంటున్నారు.
అంటే ఇవాళ రాజకీయం ఆత్మాహుతిని కోరుకుంటుందా లేదా ప్రజా శ్రేయస్సును అంతిమంగా ఆశిస్తుందా? ఒకవేళ ఎవరో ఒకరు ఏదో ఒకటి ఆశించి ఇలాంటి దుశ్చర్యలకు ఒడిగట్టి మీడియాలో హైలెట్ కావాలని పరితపించారే అనుకుందాం దాని వల్ల ఎవరికి అనర్థం.. ఎవరికి ప్రయోజనం ? ప్రాణార్పణ చేసినంత తప్పులు ఈ రాజకీయ నాయకులు చేస్తున్నారా? లేదా ప్రాణార్పణ అన్నది అంత సులువు అని భావిస్తున్నారా? ఇవాళ రాజకీయం నడపడం అన్నది మాటలు చెప్పినంత సులువు కాదు అన్నది అందరికీ తెలిసిందే! అలాంటప్పుడు రాజకీయం ఎటు నుంచి ఎటు పోనుందో అన్నది కూడా ఓ అంతు తేలని ప్రశ్నగానే ఉంది.ముఖ్యంగా మన ప్రాంతాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఒకరినొకరు తిట్టిపోసుకోవడంతో సాధించేదేమీ లేదన్న విషయం ఒకటి ఎవరికి వారు గుర్తిస్తే మేలు.
నిజనిర్ధారణ చెయ్యాల్సి వస్తే దానికి చట్ట ప్రకారం చాలా అవకాశాలు ఉన్నాయి. తప్పు చేస్తే రాజీనామా చేస్తాం అనేది పోయి ఆత్మహత్య చేసుకుంటాం వరకు వచ్చింది. నిరూపిస్తే, నిరూపించకపోతే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అలాంటప్పుడు ఒకరు ఆత్మహుతి చేసుకోవాల్సిందేగా..?? ఒకప్పుడు ప్రజా ఉద్యమాల నేపథ్యంలో ఆత్మాహుతికి పాల్పిడిన వారున్నారు. నిరూపించుకోవటానికి ఉన్న అవకాశాలను ఆశ్రయించవచ్చు. ఒకప్పుడు ఆత్మార్పణ అన్నది ప్రజా ప్రయోజనం కోరి ఉంటే ఇప్పుడు ఆత్మార్పణ అన్నది కేవలం రాజకీయ ప్రయోజనం ఆశించి ఉండడమే సిసలు వివాదానికి తార్కాణం.
– మన లోకం ప్రత్యేకం