తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. ఆయనను పార్టీ వీడకుండా ఉండేందుకు అధిష్టానం రాజగోపాల్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నా అందుకు రాజగోపాల్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. తాజాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందంటే రాజీనామాకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. తాను, తన ప్రజలు సంతోషంగా లేరని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజలకు న్యాయం చేయలేని పదవి ఎందుకు అని, అన్ని సమస్యల పరిష్కారానికి తన రాజీనామానే సరైన మార్గమన్నారు రాజగోపాల్ రెడ్డి. రాజీనామా అంశం తెరపైకి రాగానే గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు రాజగోపాల్ రెడ్డి. ఈ విధంగానైనా నియోజకవర్గం అభివృద్ధి అవుతుందనుకుంటే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి. కాగా.. కాంగ్రెస్ లో సుధీర్ఘ కాలం నుంచి పని చేస్తున్న ఆయన.. బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది.
పలు సందర్భాల్లో ఈ వాదనను తిప్పికొట్టిన రాజ్ గోపాల్ రెడ్డి.. అంతర్గతంగా మాత్రం పార్టీ మారేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వడం పట్ల ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయం పలు మార్లు ఆయన తన సన్నిహితుల వద్ద కూడా వెల్లడించారు. తెలంగాణలో పలు పార్టీల్లోని ముఖ్యమైన నాయకులను తనలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీని కోమటిరెడ్డి వ్యవహారంలో కూడా వేగంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఆయన బీజేపీలో చేరడం ఖాయమైనట్టుగా కొంత కాలంగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.