అమరావతి : ఎల్లుండి అంటే ఈ నెల 5 న రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాన్ని కె.ఆర్.ఎం.బి బృందం సందర్శించనుంది. గతంలో సందర్శనకు వస్తామన్న నేపథ్యంలో… దానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించేందుకు వస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం పంపింది కె.ఆర్.ఎం.బి బృందం. జాతీయ హరిత ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు కె.ఆర్.ఎం.బి బృందం పర్యటించనుంది.
ఈ ప్రాంతాన్ని సందర్శించి జాతీయ హరిత ట్రిబ్యూనల్ కు నివేదిక ఇవ్వనున్నారు కె.ఆర్.ఎం.బి ప్రతినిధులు. కె.ఆర్.ఎం.బి బృందంలో తెలంగాణా ప్రతినిధులు ఎవరూ ఉండకూడదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. తెలంగాణా ప్రతినిధులు ఒక్కరూ ఉన్నా.. కె.ఆర్.ఎం.బి బృందం పర్యటనకు అసలు ఒప్పుకోబోమని స్పష్టం చేసింది. కాగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం వల్ల తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఇప్పటికే తెలంగాణ సర్కార్ జాతీయ హరిత ట్రిబ్యూనల్ లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.