సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల నుంచి సలహాలు తీసుకోవడంతో పాటు, వారి సమస్యలు పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. కాలిగాయంతో గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన ఆయన.. తాజాగా ట్విటర్ వేదికగా నెటిజన్లతో ‘#AskKTR’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలు.. కేటీఆర్ సమాధానాలు
- ప్రశ్న: మీ ఆరోగ్యం ఎలా ఉంది?
కేటీఆర్: నేను ఆరోగ్యంగానే ఉన్నా బ్రదర్.
ప్రశ్న: తర్వాతి ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారు?తెరాస నుంచి సీఎం అభ్యర్థి మీరేనా?
కేటీఆర్: కేసీఆర్ గారి రూపంలో సమర్థుడైన సీఎం మనకు ఉన్నారు. తెలంగాణ ప్రజల దీవెనలతో ఆయన హ్యాట్రిక్ కొడతారు.
- ప్రశ్న: భాజపా నాయకులు ప్రచారంలో దూసుకుపోతుంటే తెరాస పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు?
కేటీఆర్: ఖాళీ గిన్నెలకు మోత ఎక్కువ.
- ప్రశ్న: నేటి యువత రాజకీయాల్లోకి రావచ్చా?ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయాలపై మీ మోటో ఏంటి? ఎలాంటి నేపథ్యం లేకుండా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరేం చెబుతారు?
కేటీఆర్: ప్రస్తుత పరిస్థితుల్లో యువత కచ్చితంగా రాజకీయాల్లో రావాలి. ఎలాంటి నేపథ్యం లేకుండా మన సీఎం సర్‌తో సహా ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు.
- ప్రశ్న: సెక్రటేరియట్ ఎప్పుడు రెడీ అవుతుంది సర్?
కేటీఆర్: దసరాకు సిద్ధమవుతుందని నేను ఆశిస్తున్నా.
- కేటీఆర్ సర్ మిమ్మల్ని బిగ్‌స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నాం. ఏదైనా అవకాశం ఉందా?
కేటీఆర్: ఇప్పటివరకూ నా రాజకీయ ప్రసంగాలను చూడకపోతే ‘బిగ్‌స్క్రీన్’పై చూడొచ్చు.
- ఆరు నెలల్లో సీఎం కేసీఆర్ మూడుసార్లు ప్రొటోకాల్ ఉల్లంఘించారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తే సాదరంగా ఆహ్వానించరా? తెలంగాణ సీఎం.. ప్రధానికన్నా గొప్పవారా? హిందీలో సమాధానం ఇవ్వగలరు!
కేటీఆర్: ప్రొటోకాల్‌ను స్పష్టంగా పాటించాం. ప్రైవేటు విజిట్‌లకు వచ్చిన ప్రధానిని సీఎం సాదరంగా ఆహ్వానించాల్సిన అవసరం లేదు. మరొక విషయం దీనిని హిందీలో రాయాల్సిన అవసరం లేదు.
- జాతీయ జెండాను వాట్సప్ డీపీగా మార్చాలని పీఎం చెప్పడం వల్ల దేశ జీడీపీ పెరుగుతుందా?
కేటీఆర్: సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ పిక్ మారిస్తే ఏం జరుగుతుంది? జీడీపీ మారితేనే దేశం ముందుకు వెళ్తుంది.