తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్, ఆ పార్టీ ఎంపీల నోటికి తాళం పడనుందా..? ఇకపై ఇతర పార్టీలను ఇష్టమొచ్చినట్లు విమర్శించే అవకాశం లేదా..? ఆ పార్టీ ఎంపీలు కూడా పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసే పరిస్థితి లేదా..? అంటే అవుననే చెప్పవచ్చు. ఇకపై కొన్ని పదాలను అన్ పార్లమెంటరీ పదాలుగా పరిగణిస్తామని లోక్ సభ సచివాలయం విడుదల చేసిన ఒక బుక్ లెట్ లో తెలిపింది.
అయితే ఇందులో చాలా పదాలు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఆ పార్టీ ఎంపీల నోటి నుంచి వచ్చేవే కావడం గమనార్హం. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో పాలకులపై తీవ్ర విమర్శలు చేశారు టీఆర్ఎస్ నేతలు. గులాబీ బాస్ కేసీఆరే ఇందుకు ఆద్యుడు కావడం విశేషం. అంతవరకు లేని తిట్లను అప్పటి కాంగ్రెస్, బీజేపీ నేతలపై కేసీఆర్ ఉపయోగించేవారు. పరుష పదజాలంతో దూషించేవారు. ఏమైనా అంటే తెలంగాణ ప్రజలు ఇలాంటి భాషే మాట్లాడతారని కవరింగ్ ఇచ్చేవారు. ఇప్పటికీ పలు ప్రెస్ మీట్లలో, బహిరంగ సమావేశాల్లో ఇలాంటి పదజాలాన్నేఉపయోగిస్తారు కేసీఆర్.
ఇక తతిమా టీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారు. అలాంటి విమర్శలతోనే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ఇప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ నేతలపై అలాంటి పదజాలాన్నే వాడతారు. అందులో ముఖ్యమైనవి జుమ్లా, కరప్ట్, శకుని, చీటర్ పదాలు. ఈ పదాలు కేటీఆర్ నోటి నుంచి తరచూ దొర్లుతుంటాయి. అసెంబ్లీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం, సమావేశాలు ఏవైనా కేటీఆర్ నోటి నుంచి తొలుత వచ్చే పదాలు ఇవే.
ముఖ్యంగా బీజేపీ నేతలపైనే కేటీఆర్ ఈ పదాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. బీజేపీకి తెలిసిందే జుమ్లా, హిందూ ముస్లిం అని.. అంతకుమించి మాట్లాడడానికి వారికి ఏమీ ఉండదని విమర్శిస్తుంటారు. అలాగే కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వారు శకుని, చీటర్ లాంటి వారని ఎద్దేవా చేస్తారు. ఇకపై ఇలాంటి పదాలు వాడడానికి వీలు లేని పరిస్థితి టీఆర్ఎస్ నేతలకు ఏర్పడింది. ముఖ్యంగా కేటీఆర్ తన నోటిని అదుపులో ఉంచుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. అయితే ఈ సూచనలు అన్ని పార్టీల నేతలందరికీ వర్తిస్తాయని గుర్తిస్తే మేలు.
లోక్ సభ నిషేధించిన పదాలను పరిశీలిస్తే.. జుమ్లాజీవి, బాజ్ బుద్ది, కోవిడ్ స్పైడర్, స్నూప్ గేట్, ఎషేమ్డ్, ఎబ్యూజ్డ్, బిట్రేయ్డ్, కరప్ట్, అనార్కిస్టు, శకుని, జైచంద్, వినాశ్ పురుష్, ఖలిస్థానీ, చీటర్, నికమ్మా, బేహ్రీ సర్కార్, బ్లడ్ షెడ్, డాంకీ లాంటి పదాలను పార్లమెంటు సభ్యులు ఉపయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని బుక్ లెట్ లో పేర్కొన్నారు. దీన్ని బట్టి ఈ పదాలు లోక్ సభలోనే కాకుండా బయట కూడా ఇతర రాజకీయ నేతలు ఉపయోగించే అవకాశం ఉండదు. ఇకపై ఆచితూచి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. చూడాలి మరి ఈ రూల్స్ ను ఎందరు నేతలు పాటిస్తారో..!