తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి ఓ కీలక పరిణామం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. ఆ విధంగా ఎప్పటి నుంచో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ లో విలీనం చేయాలన్న ప్రతిపాదన ఒకటి వివాదాలు రేపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడున్న రాజకీయ వాతావరణంలో ఉన్న విభిన్నత కారణంగా తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు అంత వేగంగా విలీన నిర్ణయాలను స్వాగతించలేవు మరియు అంగీకరించనూ లేవు.
కనుక ఇప్పటికిప్పుడు మార్పులను ఆహ్వానించాలంటే ముందు కేసీఆర్ మనసులో మాట ఏంటన్నది ఈ ప్లీనరీ (ఏప్రిల్ 27న జరిగే టీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవం) వేదికగా వెల్లడించాలి. అప్పుడే మార్పులు ఏంటి చేర్పులు ఏంటి అన్నవి తేలనున్నాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గతంలో ఇలాంటి ప్రతిపాదనే వస్తే, తన తండ్రి కేసీఆర్ ఇందుకు ఒప్పుకుంటే తాను రాజకీయాల నుంచి తన భార్య అన్నానని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అంటే ఇప్పుడు అదే మాటకు కట్టుబడి ఉంటారా లేదా కాంగ్రెస్ ఆఫర్ చేసే వాటికి లొంగి రాజకీయాలలో కొనసాగుతారా? అని విపక్షం నుంచి సందేహాలు వస్తున్నాయి. ఇవీ ఇవాళ ఓ ప్రధాన మీడియా కథనం ఆధారంగా పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న సందేహాలు మరియు అనుమానాలు మరియు అనుబంధ ప్రశ్నలు కూడా !
ఇక కాంగ్రెస్ లోకి ప్రశాంత్ కిశోర్ ఎంట్రీ ఇచ్చాక చాలా ప్రాంతీయ పార్టీల భవిష్యత్ కూడా అగమ్యగోచరం కానుందన్న ఆందోళనాపూర్వక వార్తలు కొన్ని వస్తున్నాయి. రాష్ట్రాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని తరువాత ఎన్నికల్లో లబ్ధి పొంది, అటుపై పెత్తనమంతా లేదా అధికార దర్పం అంతా తమ చేతికే తీసుకునే ప్రయత్నం ఒకటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చేయనుంది అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే కనుక నిజం అయితే రేపటి వేళ కేసీఆర్ పార్టీ మనుగడ సాగించడమే కష్టం. అదీ కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు కనుక షురూ అయితే! ఆ విధంగా కాకుండా విలీనమే ప్రథమావధి అయిన వేళ సంబంధిత నిర్ణయం అమలుకు నోచుకుంటే కేసీఆర్ హయాం అన్నది దాదాపు ముగిసి కొత్త వారి హయాం మొదలు కావొచ్చు. ఒకవేళ పొత్తు అన్నది కుదరకుండా నేరుగా విలీన ప్రక్రియ అన్నదే నిర్థారణ అయితే కేటీఆర్ ను సీఎం చేయొచ్చు..అని కూడా తెలుస్తోంది.