కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్..8 డివిజన్లో ఎవరి సత్తా ఎంతంటే

-

హైదరాబాద్‌ ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలున్నా.. అందరి దృష్టి మాత్రం అక్కడే కేంద్రీకృతమవుతుంది. ఆ అసెంబ్లీ సెగ్మెంట్‌పైనే ఎందరికీ ఆసక్తి . ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతం.. సీమాంధ్రులనగానే గుర్తొంచే చోటు.. రాజకీయంగా… ఎప్పుడూ హాట్‌ ఫేవరేటే. అదే కూకట్‌పల్లి. గత ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడిన కూకట్‌పల్లిలో ఈ సారి గ్రేటర్ రాజకీయం ఎలా ఉందంటే…

బల్దియాలో ఎన్ని డివిజన్‌లు ఉన్నప్పటికీ కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడి రాజకీయమే అందుకు కారణం.సీమాంధ్రప్రాతం ప్రజలు ఇక్కడ ఎక్కువగా స్థిరపడ్డారు. ప్రధానంగా హైదరాబాద్‌లో ఐటీ విప్లవం వచ్చాక ఈ ప్రాంతమే ఎక్కువగా అభివృద్ధి చెందింది. హైటెక్‌ సిటీ చుట్టూ వందలాది ఐటీ కంపెనీలు రావడంతో సమీపంలోని కూకట్‌పల్లి.. అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఆయా ఐటీ కంపెనీల్లో పనిచేసేందుకు వచ్చినవారిలో చాలా మంది ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు.

కూకట్‌ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది డివిజన్‌లు ఉన్నాయి. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్‌, మూసాపేట, బాలానగర్‌, ఫతే నగర్‌, బోయిన్‌పల్లి,అల్లాపూర్ ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. అయితే బేగంపేట డివిజన్‌ కూడా కొంత భాగం ఈ నియోజకవర్గంలోకి వస్తుంది. మరికొంత భాగం సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉంటుంది.

రాజకీయంగా చూస్తే, గత గ్రేటర్ ఎన్నికల్లో.. టీఆర్‌ఎస్‌ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది. గ్రేటర్‌లో.. ఈ అసెంబ్లీ పరిధిలో ఉన్న 8 డివిజన్లలో విజయం సాధించింది. గత ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ కలిసి పోటీచేసినప్పటికీ కారు జోరుకు తిరుగులేకుండా పోయింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఆశలు పెట్టుకున్న టీడీపీ… గత ఎన్నికల్లో భంగపడకతప్పలేదు. ఈసారికూడా… బాలానగర్‌ మినహా … పాత వారికే టీఆర్‌ఎస్ టికెట్లు ఇచ్చింది. బాలానగర్ డివిజన్‌లో సిట్టింగ్ అభ్యర్థి నరేంద్రచారిని కాదని.. కొత్త అభ్యర్థి రవీందర్‌ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. బాలాజీనగర్‌లో బీజేపీ కావ్యారెడ్డికి కొత్త టికెట్ ఇచ్చింది. మిగిలిన వారంతా పాత నాయకులే. ఇక్కడి డివిజన్లలో ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ అన్ని డివిజన్లలో పోటీలో ఉన్నప్పటికీ .. ఆపార్టీ అభ్యర్థుల నుంచి నామమాత్రమైన పోటీనే ఉంది. అటు టీడీపీ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీదారులుగా వారెవరూ కనిపించడంలేదు.

సీమాంధ్రులు ఎక్కువగా ఉండటంతో ఈ గ్రేటర్‌ ఎన్నికల్లో పొరుగు రాష్ట్ర రాజకీయాలపైనా చర్చ జరుగుతోంది. ఏపీ రాజధాని అమరావతి విషయంలో .. జరుగుతున్న చర్చ తమకు లాభిస్తుందని టీఆర్‌ఎస్ స్థానిక నేతలు అంచనావేస్తున్నారు. బీజేపీ అమరావతి విషయంలో తీసుకున్న స్టాండ్‌పై.. ఏపీలోని చాలా ప్రాంతాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని… ఆ ప్రభావం ఇక్కడ కూడా కనిపిస్తుందని… టీఆర్‌ఎస్‌ లెక్కలు వేస్తోంది. అయితే రాష్ట్రం ఏర్పడ్డ తరువాత… ఇప్పటికే టీఆర్‌ఎస్‌తో సాగిన ఆంధ్రప్రజలు ఈ సారి భిన్నమైన తీర్పు ఇస్తారని కమలనాథులు నమ్ముతున్నారు. అమరావతి అంశం ఇక్కడ చర్చనీయాంశమే కాదని, ఇక్కుడున్న ఆంధ్రప్రజలు .. అమరావతిని కాంక్షించేవాళ్లు కూడా తమవైపు ఉన్నారని… బీజేపీ నేతలంటున్నారు. పొరుగురాష్ట్రం వాళ్లతో పాటు, ఇతర వర్గాల వాళ్లు కూడా ఇప్పటికే మానసికంగా.. బీజేపీకి ఓటువేయబోతున్నారని… ప్రచార సమయంలో ఈ విషయం బహిర్గతం కాకపోయినా తమకు అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని కమలదళం చెబుతోంది.

గత పదేళ్లుగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కూకట్‌పల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ ఎన్నో సమస్యలున్నాయి. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, వివేకానందనగర్ డివిజన్లను మినహాయిస్తే.. మిగిలిన డివిజన్లలో సమస్యలు అధికం. చిన్న చిన్న బస్తీలు.. ఇరుకు సందులు… అస్తవ్యస్తమైన డ్రైనేజీలు.. ఫతేనగర్‌, బోయిన్పల్లి, మూసాపేట వంటి డివిజన్లలో కనిపిస్తాయి. ఇక ట్రాఫిక్ చిక్కులు చెప్పాల్సిన పనిలేదు. మూసాపేట బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్‌ సమస్య ఎన్నో ఏళ్లుగా ఉన్నదే. బాలానగర్ జంక్షన్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్ నిర్మిస్తారు. ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.

సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా ఉండటంతో ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కడతారోననే ఉత్కంఠ ఇక్కడ నెలకొంది. కులాలకు ఎక్కువగానే ప్రాధాన్యం ఉండటంతో.. పార్టీలన్నీ కులాలవారీగా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాయి. వరుసగా మూడురోజులు సెలవులు రావడం.. కరోనా సమయంలో… సొంతూళ్లకు వెళ్లిన ఐటీ ఉద్యోగులు తిరిగిరాకపోవడం.. ఇంటి నుంచే వర్క్‌ ఫ్రం హోం చేస్తుండటంతో.. ఈ సారి ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news