కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక అందరీ దృష్టి ఆకర్షిస్తుంది. చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పంలో జరుగుతున్న ఈ ఎన్నికలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటికే కుప్పం కోటని కైవసం చేసుకోవాలని అధికార వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగో పంచాయితీ, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో కుప్పంలో టీడీపీకి చెక్ పెట్టి వైసీపీ సత్తా చాటింది.
దీంతో కుప్పం మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోవాలని వైసీపీ చూస్తుంది. అసలు కుప్పంలో గెలుపు పక్కా అని వైసీపీ శ్రేణులు కాన్ఫిడెన్స్‌తో ఉన్నాయి. అయితే మొన్నటివరకు చంద్రబాబు కుప్పంలో పెద్దగా అడుగుపెట్టలేదు. కానీ ఎప్పుడైతే పంచాయితీ, ఎంపిటిసి ఎన్నికల్లో ఘోరంగా పార్టీ ఓడిపోయిందో అప్పుడు అక్కడ అడుగుపెట్టారు. అలాగే మున్సిపల్ ఎన్నిక షెడ్యూల్ రాక ముందు చంద్రబాబు కుప్పం వచ్చి రెండు రోజులు పర్యటించారు.
అలాగే ఎన్నిక ప్రక్రియ మొదలు కాగానే, రాష్ట్ర స్థాయి నేతలు కుప్పంలో పాగా వేసి టీడీపీ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఇటు నారా లోకేష్ సైతం రెండురోజులు ప్రచారం చేశారు. ఇక టీడీపీ అభ్యర్ధుల గెలుపు కోసం గట్టిగానే కృషి చేస్తున్నారు. వైసీపీకి ధీటుగా ఆర్ధికంగా కూడా ఖర్చు పెడుతుంది. దీంతో కుప్పంలో ఎవరు గెలుస్తారనే క్లారిటీ రావడం లేదు. మొదట్లో వైసీపీ గెలుపు పక్కా అని అందరూ అనుకున్నారు.
కానీ టీడీపీ కూడా గట్టి పోటీ ఇవ్వడంతో కాస్త రాజకీయం మారినట్లు కనిపిస్తోంది. అలా అని వైసీపీ లీడ్ తగ్గలేదని తెలుస్తోంది. ఇప్పటికే 25 వార్డుల్లో వైసీపీకి ఒక వార్డు ఏకగ్రీవం అయింది. మిగిలిన 24 వార్డుల్లో పోటాపోటి ఉందని తెలుస్తోంది. కానీ అందులో 14 వార్డుల్లో వైసీపీకి లీడ్ కనిపిస్తోందని తెలుస్తోంది. అంటే 15 వార్డుల్లో వైసీపీకే ఎడ్జ్ కనబడుతోంది. మొత్తానికైతే కుప్పం మున్సిపాలిటీని వైసీపీనే కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.