రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లిలో ఈ నెల 11వ తేదీన ఓ పండ్ల వ్యాపారిని హత్య చేశారు. ఈ కేసును పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ మహేశ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన శంకరయ్య(43), జయసుధ(38) దంపతులు. 14 ఏళ్ల క్రితం పటాన్‌చెరు సమీపంలో బీరంగూడకు వచ్చి పండ్ల వ్యాపారం చేశారు.
శంకరయ్య ఏడాది క్రితం శంకర్‌పల్లి మండలం టంగటూర్‌లో దానిమ్మ తోట లీజు తీసుకున్నాడు. అక్కడికి వారానికోసారి వచ్చి వెళ్తుండేవాడు. బీరంగూడలోని పండ్ల దుకాణంలో భార్య జయసుధ ఉండేది. స్థానికంగా ఉండే జిమ్ ట్రైనర్ తిరుపతిరావు(25 ఏళ్లు)తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. తన భర్త శంకరయ్య రోజూ మద్యం తాగి చిత్రహింసలు పెడుతున్నాడని, అతడిని చంపేద్దామని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. టంగటూర్ గ్రామ శివారులో శంకరయ్య తలపై కట్టెతో కొట్టి, కత్తితో గొంతు కోశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు కేసును చేధించారు.