రాజాసింగ్‌కు లైన్ క్లియర్.. సస్పెన్షన్ ఎత్తివేత?

-

ఎట్టకేలకు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్..జైలు నుంచి విడుదలయ్యారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పాతబస్తీలో ఎం‌ఐ‌ఎం శ్రేణులు ఆందోళనలు చేశాయి. ఈ క్రమంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విధానంగా సరిగ్గా లేదని చెప్పి వెంటనే కోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ తర్వాత విద్వేష ప్రసంగాలతో సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారన్న ఆరోపణలతో పోలీసులు రాజాసింగ్‌పై ఆగస్టు 25న పీడీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అప్పటి నుంచి రాజాసింగ్‌ రెండున్నర నెలలుగా చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. రాజాసింగ్‌ అరెస్టుపై ఆయన భార్య ఉషాభాయి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా కోర్టులో విచారణ జరగగా, రాజాసింగ్‌కు బెయిల్ మంజురైంది. తాజాగా బెయిల్‌పై రాజాసింగ్ బయటకొచ్చారు. ఇక ఆంక్షలు నేపథ్యంలో మీడియాతో రాజాసింగ్ మాట్లాడలేదు. ఎక్కడా ర్యాలీలు జరగలేదు.

శ్రీరాముడు, గోమాత ఆశీర్వాదంతో తాను జైలు నుంచి క్షేమంగా బయటకు వచ్చినట్లు రాజాసింగ్‌ చెప్పారు. రాజాసింగ్ బయటకు రావడంతో..స్థానిక బి‌జే‌పి శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే రాజసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనపై బి‌జే‌పి సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. అలాగే ఆ కామెంట్లకు సంబంధించి వివరణ ఇవ్వాలని కూడా కోరారు. వాటిపై రాజాసింగ్ వివరణ కూడా ఇచ్చారు. అయితే బి‌జే‌పి సస్పెన్షన్‌ని కొనసాగించింది. ఇక ఇప్పుడు జైలు నుంచి బయటకు రావడంతో ఆయనపై సస్పెన్షన్‌ని ఎత్తివేసే దిశగా బి‌జే‌పి ఆలోచిస్తుందని తెలిసింది.

సస్పెన్షన్‌ ఎత్తివేతపై బీజేపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సానుకూలత వ్యక్తం చేసినట్టు పార్టీ రాష్ట్ర వర్గాలు పేర్కొన్నాయి. రెండు రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సస్పెషన్ ఎత్తివేశాక రాజాసింగ్ మరింత దూకుడుగా రాజకీయం చేస్తారా? ఎప్పటిలాగానే తనదైన శైలిలో ముందుకెళ్తారో లేదో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news