కవితని వదలని లిక్కర్ స్కామ్ కష్టాలు..కూరుకుపోయినట్లేనా.!

-

కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్  కష్టాలు కొనసాగుతున్నాయి. ఆమె పేరు పదే పదే లిక్కర్ స్కామ్‌లో వినిపిస్తూనే ఉంది. మొదట ఆమె పేరుని ఢిల్లీ బీజేపీ నేతలు ప్రస్తావించారు. అప్పటినుంచి ఈ స్కామ్‌కు సంబంధించి ఏదొక అంశంలో కవిత పేరు బయటకొస్తూనే ఉంది. ఆ తర్వాత అరోరా ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరు వచ్చింది. ఇదిలా నడుస్తుండగానే ఈ స్కామ్‌కు సంబంధించి సి‌బి‌ఐ..కవితని విచారణ కూడా చేసింది.

ఇక విచారణ అయిన తర్వాత మళ్ళీ స్కామ్‌కు సంబంధించిన అంశాలపై కథనాలు రాలేదు. కానీ తాజాగా మరోసారి ఈడీ రిపోర్టులో కవిత పేరు బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సమీర్‌ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన 181 పేజీల చార్జ్‌షీట్‌లో 28 సార్లు కవిత పేరును ప్రస్తావించింది. కవితతో కలిసే సమీర్‌ మహేంద్రు మద్యం వ్యాపారం చేసినట్లు వెల్లడించింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలో.. కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్‌, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, ఆడిటర్‌ బుచ్చిబాబు, పెర్నార్డ్‌ రికార్డ్‌కు చెందిన బినయ్‌ బాబు పలుమార్లు ఆప్‌ నేతలతో భేటీ అయ్యారని, హోల్‌సేల్‌, రిటైల్‌ ఉత్పత్తిదారులతో కుమ్మక్కై కార్టెల్‌(సిండికేట్‌)ను ఏర్పాటు చేశారని స్పష్టం చేసింది.

10 వేల కోట్ల ఆదాయం ఉన్న మద్యం వ్యాపారాన్ని చేజిక్కుంచుకోవడం కోసం వంద కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారాయని ఛార్ఙిషీట్‌లో పేర్కొంది. ఈ విధంగా కవిత పేరు రిపోర్టులో పదే పదే ప్రస్తావనకు వచ్చింది. దీని బట్టి చూస్తుంటే లిక్కర్ స్కామ్‌లో కవిత పూర్తిగా కూరుకుపోయినట్లే కనిపిస్తున్నారు. మరి దీనిపై రానున్న రోజుల్లో ఎలాంటి సంచలనమైన అంశాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news