లోకల్ ఎన్నికల అజెండా పక్కదారి పట్టిందా

-

పంచాయతీ ఎన్నికలు ప్రధానంగా స్థానిక సమస్యల చుట్టూ తిరుగుతాయి. కానీ ఈసారి స్థానిక ఎన్నికల అజెండా పక్కదారి పట్టింది. రాష్ట్ర స్థాయి నేతలు రంగంలోకి దిగడంతో.. అందరూ అదేహోరులో కొట్టుకుపోతున్నారు. దాదాపుగా అసెంబ్లీ ఎన్నికల అజెండానే.. పంచాయతీ ఎన్నికల ప్రచారంలోనూ కనిపిస్తోంది.

ఏపీలో రాష్ట్రస్థాయి అజెండాతో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ రాష్ట్ర స్థాయి అంశాలనై తెరమీదకు తెస్తున్నాయి. గ్రామాల్లో అభ్యర్థులు కూడా ఇవే చెబుతున్నారు. దీంతో ఓటర్లు కూడా జరుగుతున్నవి స్థానిక ఎన్నికలా, అసెంబ్లీ ఎన్నికలా అని అనుమాననపడుతున్న పరిస్థితి నెలకొంది. పేరుకు పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నా.. పలువురు అభ్యర్థులు ప్రచారంలో తమకు ఫలానా పార్టీ మద్దతు ఉందని చెబుతూ. ఆ పార్టీ మ్యానిఫెస్టోను ఊదరగొడుతున్నారు. దీంతో విస్తుబోవడం ఓటర్ల వంతౌతోంది.

స్వయంగా ఎమ్మెల్యే స్థాయి నేతలే ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి ప్రస్తుత ప్రభుత్వ పథకాలు, గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాల్ని గుర్తుచేస్తూ ఓట్లడుగుతున్న పరిస్థితులున్నాయి. చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు సర్పంచ్ అభ్యర్థుల్ని పక్కనపెట్టుకునే గ్రామసభలు పెట్టి మరీ ఓటర్లను ఓట్లడుగుతున్నారు. దీంతో స్థానిక అజెండా పక్కదారి పడుతోంది.జరుగుతున్న ఎన్నికలు ఏవైనా.. సీక్రెట్ ఓటింగ్ నిబంధన మాత్రం ఉంటుంది. కానీ ఈసారి పంచాయతీ ఎన్నికలు ఎవరు ఎవరికి ఓటేస్తున్నారో నిఘా పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గ్రామాల్లో ప్రతి ఓటరూ భయం భయంగా పోలింగ్ బూతులోకి వెళ్లి ఓటేయాల్సిన పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఈ స్థాయిలో పార్టీలు నిఘా పెట్టలేదని ఓటర్లు మొత్తుకుంటున్నారు. గతంలో చాలా సార్లు రెండు పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని ఇష్టం వచ్చిన వారికి ఓటేసిన బాపతు ఓటర్లకు.. ఈసారి చుక్కలు కనిపిస్తున్నాయి. పలు చోట్ల అభ్యర్థులు పోలింగ్ ముగియగానే.. ఓటేయని వారిని నిలదీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏపీలో అన్ని జిల్లాల్లోనూ పంచాయతీ ఫీవర్ కనిపిస్తోంది. ప్రతి పార్టీ ప్రత్యర్థి పార్టీని మించి ఖర్చుపెడుతోంది. ఎవరికి వారే డబ్బుల పంపంకంలో తామే ముందున్నామని అంతర్గత సమావేశాల్లో చెప్పుకుంటున్నారు. ఇక పోటీ తీవ్రంగా ఉండే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అయితే ఇక చెప్పక్కర్లేదు. ఈసారి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. విచిత్రం ఏంటంటే ఈసారి ప్రధాన పార్టీలు కూడా లోకల్ పోల్స్ కోసం కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశాయి.

ఫలితాల విషయంలో కూడా ప్రధాన పార్టీలు పోటీపడి ప్రకటనలు చేస్తూ చాలా హడావిడి చేస్తున్నాయి. ఈసారి క్యాంప్ రాజకీయాలు కూడా ఊపందుకున్నాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలు జరిగే సమయంలో పెట్టాల్సిన క్యాంపుల్ని.. ఈసారి గెలిచినవారిని కాపాడుకోవడానికి పెట్టేంతగా ప్రధాన పార్టీలు పనిచేస్తున్నాయి. అయితే ఇవేవీ అధికారికంగా జరగడం లేదు. అంతా అనధికారికమే. ఎవరి వ్యూహాల్లో వారు తలమునకలై పనిచేస్తూ.. ప్రత్యర్థిపై పైచేయి సాధించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news