మరోసారి వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఇవాళ నారా లోకేశ్ ఎక్స్ వేదికగా సీఎం జగన్‌ను టార్గెట్‌గా చేసుకొని పోస్ట్‌లు చేశారు. నాలుగున్నరేళ్లుగా దోచుకోవడం, దాచుకోవడం, దాడులు చేయడం తప్పించి చేసిన అభివృద్ధి శూన్యం అని నారా లోకేశ్ పేర్కొన్నారు. సీఎంగా చేసిన మంచి పని ఒక్కటీ లేదని తెలిపారు నారా లోకేశ్. అసలే సైకో అయిన జగన్ కు అధికార మదం ఎక్కిందని, ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరి పిచ్చిగా వాగుతున్నాడని నారా లోకేశ్ వివరించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై జగన్ ప్రేలాపనలు చూస్తుంటే పిచ్చి ముదిరిందని స్పష్టమవుతోందని వ్యంగ్యం ప్రదర్శించారు నారా లోకేశ్. లోటు బడ్జెట్ తో ఏర్పడిన నవ్యాంధ్రను ఏ లోటూ లేకుండా అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెట్టించినందుకు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారా? అంటూ లోకేశ్ మండిపడ్డారు. పిచ్చి జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి 73 ఏళ్ల చంద్రబాబును నెల రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారని నారా లోకేశ్ ఆరోపించారు.
అంతేకాకుండా.. అమిత్ షాతో భేటీని వివరిస్తూ.. ‘‘కేంద్ర హోం మంత్రి కలవాలనుకుంటున్నట్టు కిషన్‌రెడ్డి ఫోన్ చేశారు. చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాలపై హోం మంత్రి అమిత్ షాకు అన్ని విషయాలు వివరించా. చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పాను. ఆయనకు భద్రతా పరంగా ఉన్న ఆందోళన గురించి కూడా చెప్పాను. సీఐడీ ఎందుకు పిలిచింది.. ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారు. అన్నీ పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసులే అని అమిత్ షాకు చెప్పా. భాజపానే చేయిస్తోందని ఒక ఎంపీ, మంత్రి నేరుగా అన్నట్టు అమిత్ షాకు తెలిపాను. భాజపా పాత్ర ఉందని నేను అనుకోవట్లేదు. భాజపా నేతల మౌనంతో ఆరోపణలు వచ్చాయనుకుంటున్నా. నిజం వైపు ఉండాలని అమిత్ షాను కోరా. తెదేపా ఎంపీలు ప్రధాని, హోం మంత్రికి లేఖలు రాశారు’’ అని లోకేశ్ మీడియాకు వివరించారు.