మాచర్ల నియోజకవర్గం…వైసీపీకి కంచుకోట…ఇంకా చెప్పాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డా..అసలు ఇక్కడ టీడీపీకి ఏ మాత్రం పట్టు లేదు. ఎప్పుడో 1999 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ గెలిచింది…ఆ తర్వాత ఎప్పుడు ఇక్కడ పార్టీ గెలవలేదు. ఇక 2009 ఎన్నికల నుంచి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వరుసగా మాచర్లలో గెలుస్తూ వస్తున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పిన్నెల్లి…ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. నెక్స్ట్ 2012 ఉపఎన్నికలో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు.
ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ నుంచి పిన్నెల్లి విజయం సాధించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లికి మాచర్లపై పూర్తి పట్టు ఉంది. అలాగే అక్కడి ప్రజలకు….పిన్నెల్లిపై అభిమానం ఉంది…అందుకే స్థానిక ఎన్నికల్లో కూడా మాచర్లలో వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. స్థానిక ఎన్నికల్లో టీడీపీని నామినేషన్ కూడా వేయనివ్వలేదు. ఇక అప్పటినుంచి మాచర్లపై టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా పిన్నెల్లికి చెక్ పెట్టాలని చూస్తుంది.
ఇదే క్రమంలో అభ్యర్ధిని కూడా మార్చారు. గత ఎన్నికల్లో పిన్నెల్లిపై పోటీ చేసి ఓడిపోయిన అంజిరెడ్డిని పక్కన పెట్టి….ఎన్నో ఏళ్ల నుంచి టీడీపీ కోసం పనిచేస్తున్న జూలకంటి ఫ్యామిలీకి సీటు ఇచ్చారు. జూలకంటి బ్రహ్మానందరెడ్డిని ఇంచార్జ్ గా పెట్టారు. జూలకంటి వచ్చాక మాచర్లలో టీడీపీ వర్గాల్లో జోష్ పెరిగింది. ఇదే సమయంలో వరుసగా టీడీపీ కార్యకర్తల హత్యలు జరిగాయి. ఈ క్రమంలోనే మాచర్లకు చంద్రబాబు, లోకేశ్ వచ్చారు. తాజాగా లోకేశ్ మాచర్లలో పర్యటించి….హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి, ఆర్ధిక సాయం చేశారు.
అలాగే పిన్నెల్లికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు…2024 తర్వాత పిన్నెల్లి ఎక్కడ ఉన్నా వదలమని హెచ్చరించారు. అంటే పిన్నెల్లి ఓడిపోయి, ఎక్కడికైనా వెళ్లిపోతారు అనే కోణంలో లోకేశ్ మాట్లాడారు. అసలు ఎక్కడికైనా వెళ్ళడం కాదు…ముందు మాచర్ల బరిలో పిన్నెల్లిని ఓడించడం అనేది సులువు కాదు. పూర్తి స్థాయిలో బలం ఉన్న పిన్నెల్లికి చెక్ పెట్టడం చినబాబుకు సాధ్యమైన పని కాదు. కాబట్టి చినబాబు సవాళ్ళు…కేవలం మాటలకే తప్ప…చేతలకు పనికిరావని చెప్పొచ్చు.