మహారాష్ట్ర పుణెలో గణేశ్ రఖ్ అనే ఓ డాక్టర్ ఆ ప్రాంతంలోని ప్రజలతో జేజేలు కొట్టించుకుంటున్నారు. ఆ ప్రాంత ప్రజలంతా ఆ వైద్యుడిని రాజువయ్యా.. మహరాజువయ్యా అంటూ ప్రశంసలతో ఆకాశానికెత్తేస్తున్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటారా.. ఎందుకంటే ఆ డాక్టర్ చేస్తున్న ఓ మంచి పనిని చూసి. ఇంతకీ ఆ డాక్టర్ చేసే మంచి పని ఏంటంటే..?
మహారాష్ట్రలోని హదప్సర్ ప్రాంతంలో గణేశ్ రఖ్కు మెటర్నిటీ-కమ్-మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలో 11 సంవత్సరాల నుంచి గణేశ్ రఖ్ అనే డాక్టర్ ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. తన ఆసుపత్రిలో చేరిన గర్భిణీలకు ఆడపిల్ల పుడితే ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఉచిత వైద్యం చేస్తున్నారు. ఆడపిల్లల భ్రూణ హత్యలను నివారించటానికి ప్రజలలో అవగాహన కల్పించేందుకు “బేటీ బచావో జనాందోళన్” అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు తన ఆసుపత్రిలో 2,400 మంది ఆడపిల్లలు పుట్టారు. ఈ డాక్టర్.. ఆడపిల్లల తల్లిదండ్రుల వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత వైద్యాన్ని అందించారు.
“2012కు ముందు నేను ఆసుపత్రిలో కొన్ని భిన్న రకాలు అనుభవాలను ఎదుర్కొన్నాను. ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చినవారు ఆడబిడ్డకి జన్మనిస్తే వారిని చూడటానికి కుటుంబ సభ్యులెవ్వరూ వచ్చేవారు కాదు. ఈ ఘటనలు నా మనసును కదిలించాయి. అందుకే ప్రజలలో లింగవివక్షతను తొలగించేందుకు ఏదైనా చేయాలనిపించింది. అందుకే 2012లో ఈ కార్యక్రమానికి పునాదులు వేశాను. ఆసుపత్రిలో ఆడశిశువు జన్మించిన తరువాత వారికి నామకరణం చేస్తే ఎటువంటి ఫీజు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను” అని డాక్టర్ రఖ్ చెప్పారు.