రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో దేశ రాజకీయాలు వాడీవేడీగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు వినిపిస్తున్నా.. అందుకు ఆయన సుముఖత చూపడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం శరద్ పవార్‌తో భేటీ అయ్యారు.
కాగా, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రేపు ఢిల్లీలో విపక్షాలు భేటీ కానున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతోపాటు ప్రతిపక్ష పార్టీల సీఎంలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఢిల్లీ చేరుకున్న మమతా బెనర్జీ.. శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్ అయితే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ, విపక్ష పార్టీలు భావిస్తున్నాయి.
అయితే రాష్ట్రపతి అభ్యర్థి రేసులో పవార్ లేనట్లు ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునందుకు అవసరమైన సంఖ్యా బలం లేదు. దీంతో ఓడిపోయే పోరులో బరిలో దిగడానికి శరద్ పవార్ సుముఖత చూపట్లేదని సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు ఆయనను ఒప్పించేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.