కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో అందరికీ తెలిసిందే. అన్ని దేశాలు తమ తమ ప్రాంతాల్లో కరోనా రోగులు, అనుమానితులకు ఐసొలేషన్, క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి చికిత్సనందిస్తూ వారిని 24 గంటలూ పరిశీలిస్తున్నాయి. అయితే కొందరు మాత్రం ప్రభుత్వాల సూచనలను పెడచెవిన పెడుతున్నారు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అమెరికాలో ఓ జంట కరోనా లేకున్నా వస్తుందేమోనన్న అనుమానంతో సొంత వైద్యం చేసుకున్నారు. భర్త ప్రాణాలు పోగొట్టుకున్నాడు. భార్య విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
అమెరికాలోని అరిజోనా మేరీకోపా కౌంటీకి చెందిన ఓ వృద్ద జంట మలేరియా చికిత్సకు ఉపయోగించే హైడ్రోక్లోరోక్విన్ మందును వేసుకున్నారు. వారికి నిజానికి కరోనా లేదు. కానీ వస్తుందేమోనన్న అనుమానంతో.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు కదా.. అని ఆ మందును వేసుకున్నారు. దీంతో ఆ జంటలో భర్త గుండె పోటుతో చనిపోయాడు. భార్య విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
ఈ క్రమంలో ఎవరూ సొంత వైద్యం చేసుకోకూడదని, అది ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా లేకుంటే మందులు వేసుకోవాల్సిన అవసరం లేదని, ఉంటే డాక్టర్లను సంప్రదించాలి తప్ప సొంతంగా మందులు వేసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.