దేశంలో కొన్ని రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తుండగా, కొన్ని రాష్ట్రాల్లో వరుణుడు ముఖం చాటేశాడు. బీహార్ లో ఇప్పటికీ వాన చినుకు లేక ప్రజలు అల్లాడుతున్నారు. దీనిపై ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త కేంద్రానికి ఆశ్చర్యకరమైన రీతిలో దరఖాస్తు చేశాడు. వర్షాలు ఎందుకు కురవడంలేదో దేవుడ్ని అడిగి చెప్పాలని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కేంద్రాన్ని వివరణ కోరాడు.
బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద కేంద్ర భూవిజ్ఞాన శాఖ అధికారులకు విచిత్రమైన దరఖాస్తు చేశారు. వర్షా కాలంలో ఎండలు, ఉక్కపోతతో విసిగిపోతున్నట్లు తెలిపాడు. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని తెలిపారు. దీనికి ఖచ్చితమైన కారణమేంటో తెలపాలని కేంద్ర భూ విజ్ఞాన శాఖను కోరాడు. తాను అడిగిన ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేకపోతే.. అవసరం అనుకుంటే దేవుడిని అడిగైనా సరే తనకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ దరఖాస్తులో పేర్కొన్నారు. అంతేకాకుండా తన దరఖాస్తులో దేవుడిని కూడా ఓ ప్రతివాదిగా చేర్చడం గమనార్హం.