కలువనివ్వని కరోనా.. వీడియో కాన్ఫరెన్స్‌లో వివాహం

-

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ముప్పు తిప్పలు పెడుతున్నది. ఈ వైరస్‌ విజృంభనకు భయపడి దాదాపు అన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. దీంతో ఎన్నో విషాదాలు, వాటితోపాటే వింతలు చోటుచేసుకుంటున్నాయి. తండ్రి చివరిచూపులకు నోచుకోని ఎన్నారై కొడుకు, కొడుకు కరోనాతో ఐసోలేషన్‌లో ఉంటే తల్లిడిల్లుతున్న తల్లిదండ్రులు వంటి విషాద ఘటనలతోపాటే.. తిరుమలలో పెండ్లిళ్లకు అనుమతిలేక రోడ్డుపై పెండ్లి చేసుకున్న జంట, బస్సులో తుమ్మిన వ్యక్తిని చితకబాదిన తోటి ప్రయాణికులు వంటి వింత ఘటనలూ జరుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే బీహార్ రాజ‌ధాని ప‌ట్నాలో కూడా ఒక వింత పెండ్లి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్నాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉండే వధువు, వరుడికి పెండ్లి నిశ్చయమైంది. ఈ పెండ్లి కోసం నెల ముందుగానే ఒక ఫంక్షన్‌ బుక్‌చేశారు. ఇరువైపుల ఇండ్లలో పెండ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఇంతలో పెండ్లి ముహూర్తం దగ్గరపడింది. వధువు ఇంటికి వధువు తరఫు బంధుమిత్రులు, వరుడి ఇంటికి వరుడి తరఫు బంధుమిత్రులు చేరుకున్నారు. ఇక తెల్లారితే ఫంక్షన్‌ హాల్లో పెండ్లి. కానీ ఆ పెండ్లి ఫంక్షన్‌ హాల్లో జరుగలేదు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఫంక్షన్‌ హాల్లో పెండ్లికి పోలీసులు నిరాకరించారు. అసలు రెండు వైపుల వారిని ఇండ్ల నుంచి బయటకు కూడా రానివ్వలేదు. దీంతో చేసేదిలేక ఇరువైపుల పెద్దలు మాట్లాడుకుని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అనుకున్న సమయానికే పెండ్లి జరిపించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా తమ నిర్ణయాన్ని అమలు చేశారు. దీంతో వధూవరులిద్దరు ఒక్కదగ్గర లేకున్నా వీడియో కాన్ఫరెన్స్‌లో పెండ్లి ద్వారా ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తూ వైర‌ల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news