ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మహిళా ప్రజా ప్రతినిధులు, నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా మహిళా నేతలంతా శనివారం రాజ్ భవన్‌కు వచ్చారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్న పోలీసులు వారిని లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ మహిళా నేతలు రాజ్ భవన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎలాంటి అవాంచనీయ సంఘటలు చోటుచేసుకోకుండా మేయర్ విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఒకపక్క కవితను ఈడీ ప్రశ్నిస్తుండగా, మరోపక్క ఢిల్లీలోనూ, ఇటు హైదరాబాద్లోనూ బీఆర్ఎస్ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతల ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు మండిపడుతున్నారు. కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున దుమారం చోటుచేసుకుంది.