కన్నుల పండగగా సాగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసింది. గత నెల రోజులుగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నా… ఈనెల 16 నుంచి 19 వరకు మహాజాతర జరిగింది. గిరిజన కుంభమేళాగా పిలిచే మేడారం జాతర సమ్మక-సారలమ్మ తల్లుల వన ప్రవేశంతో ముగిసింది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వనదేవతలను సాగనంపారు పూజారులు. సమ్మక్క గద్దెల వద్ద నుంచి చిలకల గుట్టకు చేరింది. సారలమ్మ కన్నెపెల్లికి చేరింది. పగిడిద్ద రాజును పూనుగొండ్లకు, గోవిందరాజును కొండాయికి పంపనున్నారు. దీంతో జాతర అధికారికంగా ముగిసినట్లు అయింది. మరో రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ మేడారం మహాజాతర జరగనుంది.
ఈ ఏడాది మేడారం జాతరకు 1 -1.5 కోటి మంది భక్తులు సందర్శించుకున్నట్లు అంచానా. తల్లులు గద్దెపైకి చేరడంతో ఎక్కువ మంది భక్తులు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడాారాన్ని సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా మేడారం జాతర సాగింది. చిన్నచిన్న ఘటనలు మినహా.. ప్రశాంతంగా జాతరను నిర్వహించడంలో అధికారులు సక్సెస్ అయ్యారు.