కొత్త కోణం: పవన్ కి వీర్రాజు చాలా రుణపడిపోతున్నాడబ్బా!!

-

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఆవేశం ఎక్కువని, దూకుడు జాస్తి అని అంటుంటారు! దానికి తగ్గట్లుగానే.. చంద్రబాబు పేరు చెబితే ఆయనలో ఆవేశం, అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ఫెర్మార్మెన్స్ లో దూకుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు! అయితే ఆ రెండు లక్షణాలే కాదు.. వీర్రాజు సహనం పాళ్లు కూడా ఎక్కువేనని నిరూపిస్తున్నారు పవన్!

అవును… ప్రెస్ మీట్ లలో మాంచి ఆవేశంగా మాట్లాడే వీర్రాజు ఒక విషయంలో మాత్రం అడ్డంగా దొరికిపోతున్నారు! ఇలా ఆవేశం, దూకుడు పుష్కలంగా ఉన్న వీర్రాజుని ఇరకాటంలో పెడుతున్న అంశం జనసేన అధ్యక్షుడు పవన్ వ్యవహారం. తాజాగా జరిగిన రెండు సంఘటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి!

గతంలో మీడియా.. వీర్రాజు వద్ద చంద్రబాబు స్టేట్ మెంట్స్ గురించి ప్రస్థావించగా… హైదరాబాద్ లో కూర్చుని మాట్లాడే వారికి విలువ ఏముంటుంది? గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి మాట్లాడమనండి అని బాబు గాలి తీసేశారు! ఇంతలోనే మీడియా నుంచి ఒక ప్రశ్న వెలువడింది! “మీ మిత్రుడు పవన్ కూడా హైదరాబాద్ నుంచే కదా రాజకీయం చేస్తుంది” అని! వెంటనే మరోమాటలేకుండా.. అర్ధాంతరంగా ప్రెస్ మీట్ ముగించి.. రెండు చేతులూ జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్లిపోయారు వీర్రాజు!

ఇదే సమయంలో తాజాగా మరో దెబ్బ తగిలింది వీర్రాజుకి! “ఏపీ రాజధాని విషయంలో.. అధి రాష్ట్రం ఇష్టం అని కేంద్రంలోని పెద్దలు చెబుతున్నారు.. మూడు రాజధానులకు ఏపీ బీజేపీ నేతలు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు! దీంతో మూడు రాజధానులు మంచిదే అని ఏపీ బీజేపీ నేతలు అంటుంటే…. మీ మిత్రుడు పవన్ మాత్రం అమరావతే రాజధానిగా ఉండాలని అంటున్నాడు” అని అడిగిన ప్రశ్నకు సైతం.. చేతిలో ఉన్న వీర్రాజు మైకు టేబుల్ మీదకు, చేతులు రెండూ ఫ్యాంట్ జేబులోకి అసంకల్పితంగా వెళ్లిపోయాయి!! నోటికి మాస్క్ వచ్చి చేరింది!!

దీంతో… ఆవేశం – దూకుడు మాత్రమే ఉన్న వీర్రాజులో శాంత స్వభావాన్ని, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునే లక్షణాన్ని అలవాటు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్! పవన్ కి వీర్రాజు చాలా రుణపడిపోతున్నాడబ్బా!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news