ఏపీలో వైసీపీ నేతలకు జనసేన నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. మరోసారి జనసేనాని పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు పవన్ కల్యాణ్ ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నాడని, ఆయన ఏదో సాధిస్తాడని నమ్మే వాళ్లకు చెబుతున్నానని, పవన్ ను చూస్తే జాలేస్తోందంటూ వ్యంగ్యస్ర్తాలు సంధించారు. వీర మహిళలు, జన సైనికులు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నారు? ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారో మీకు స్పష్టత ఉందా..? అంటూ ప్రశ్నించారు మంత్రి అంబటి. మీ నాయకుడు ఎవరితో పొత్తులో ఉన్నాడు? బీజేపీతో పొత్తులో ఉన్నామంటారు… టీడీపీకి కన్ను కొడతారు.. చంద్రబాబు విదిలించే మెతుకుల కోసం తాపత్రయ పడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.
ఇదిలా ఉంటే.. ఉదయం.. ‘జనసేన వీర మహిళకు నమస్కారం! బాబుని అందలం ఎక్కించాలనా?.. కళ్యాణ్ బాబుని సీఎంని చేయాలనా?.. ఏమిటి మీ ప్రయత్నం?.. వివరంగా వివరించగలరా ?’అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించారు మంత్రి అంబటి. జనసేన వీర మహిళలు ఏపీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్ ఇస్తూ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వారికి కౌంటర్‌గా మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు.