టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు విశాఖ పర్యటనను నిన్న పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. విశాఖ ఎయిర్‌పోర్టులోనే చంద్రబాబు నాయుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు 151 సెక్షన్ కింద ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో పంపించేశారు. దీంతో ప్రోగ్రామ్ పెట్టుకుంది టీడీపీ అయితే వైసీపీ వాళ్ళు రావడం ఏంటి..? పోలీసు రక్షణ కల్పించాల్సింది ఎవరికి..? టీడీపీ యాత్రకు పోలీసు రక్షణ ఇస్తారా..? యాత్ర అడ్డుకునే వైసీపీ వాళ్లకు రక్షణ కల్పిస్తారా..? మంత్రులే అడ్డుకోమని పిలుపు ఇస్తారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు టీడీపీ నేతలు. ఇదిలా ఉంటే.. నిన్న విశాఖ ఎయిర్ పోర్టు వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవర్తించిన తీరు సరికాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
విశాఖలో జరిగిన ఘటనలకు వైసీపీ కారణమంటూ ఆరోపణలు చేస్తున్నారని, ఆ ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని బొత్స స్పష్టం చేశారు. ఓ పెళ్లికి వెళుతూ చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా చేసిన హడావుడి తప్ప ఇది మరొకటి కాదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబుకు అక్కడి ప్రజలు స్వాగతం పలుకుతారా? రాయలసీమ వెళ్లినా చంద్రబాబు ఇదే పరిస్థితి ఎదుర్కోక తప్పదు అని వ్యాఖ్యానించారు. కాగా, చంద్రబాబు విశాఖలో పార్టీ ముఖ్యనేత అయ్యన్నపాత్రుడి కుమారుడి వివాహానికి హాజరవ్వాల్సి ఉంది. అయితే తీవ్ర నిరసనల కారణంగా చంద్రబాబును పోలీసులు విశాఖ నుంచి హైదరాబాద్ పంపించేశారు.