ప్రేరణ కార్యక్రమం అభినందనీయం : మంత్రి గంగుల

-

కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో యువతకు డ్రగ్స్, ఆన్లైన్ మోసాలు, హోం లోన్ యాప్ లు, కెరీర్ గైడెన్స్ లపై అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ప్రేరణ 2023 కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉన్నతి గార్డెన్స్ లో ప్రేరణ సదస్సు నిర్వహించారు. ఈ నేపథ్యంలో యువతకు మంత్రి గంగుల, కలెక్టర్ కర్ణన్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేరాలు జరగకుండా ప్రేరణ లాంటి కార్యక్రమాలు చేపట్టిన కరీంనగర్ కమిషనరేట్ పోలీసులను అభినందించారు మంత్రి గంగుల. గత ప్రభుత్వాల హయాంలో చదువుకునే స్తోమత లేక ఎంతోమంది చదువుకు దూరమైన పరిస్థితులు ఉండేవన్నారు.

నేడు తెలంగాణ ప్రభుత్వంలో ప్రైవేటు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వెల్లడించారు. ఆనాడు చదువుకునే కోరికను చంపుకొని సంఘ విద్రోహక శక్తులుగా మారిన రోజులు ఉండేవ‌ని గుర్తు చేశారు గంగుల. కానీ ఇప్పుడు రోజులు మారాయనీ, చదివించే స్తోమత లేకపోయినప్పటికీ తమ బిడ్డలు గొప్పగా చదువుకోవాలని ప్రతి తల్లిదండ్రులు రాత్రి పగలు కష్టపడి తమ పిల్లలను గొప్ప చదువులు చదివిస్తున్నారనీ వెల్లడించారు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి విద్యార్థి చదువుకోవాలనీ, తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసినప్పుడే మీ జన్మకు సార్థకత ల‌భిస్తుంద‌న్నారు. ప్రతి దాంట్లో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ రెండు ఉంటాయనీ, ప్రతి దానిని మంచి కోసం సద్వినియోగం చేసుకోవాలే తప్ప చెడు కోసం కాదని వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news