తెలంగాణలోని రైతులకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శుభవార్త చెప్పారు. అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో రైతుబంధు నిధులు అందేలా చూస్తామని అన్నారు మంత్రి హరీశ్ రావు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. వానాకాలం రైతు బంధు నిధుల విడుదలపై హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 4 ఏకరాల వరకు ఉన్న 51.99 లక్షల మంది రైతులకు సంబంధించి 3,946 కోట్ల రూపాయలు విడుదల చేశామని వెల్లడించారు మంత్రి హరీశ్ రావు.
అలాగే 78 లక్షల 93 వేల 413 ఎకరాలకు సంబంధించిన నిధులు విడుదల చేసినట్లు వివరాలను వెల్లడించిన మంత్రి హరీశ్ రావు.. ఐదు ఎకరాల పైబడి ఉన్న రైతులకు రేపటి నుంచి రైతుబంధు నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ అయ్యేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి హరీశ్ రావు.