గోదావరి జిల్లాలో కీలక మంత్రి సడన్ గా ఎందుకు సైలెంటయ్యారు…!

ఆ మంత్రి అదృష్టవంతుడు, రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్లకే మంత్రి అయ్యారు. అయితే మంత్రిని గెలిపించిన ప్రజలే దురదృష్టవంతులు. ఉండుండి ఒక్కసారిగా మంత్రి సైలెంట్ అయిపోయారు. దీనితో మంత్రి పంచన ఉండే నేతలంతా కొత్తగా వచ్చిన మంత్రి చుట్టూ తిరుగుతున్నరంటా……. అసలు మంత్రి కన్నబాబుకు ఏమైందీ.. సైలెంట్ కావడానికి కారణాలు ఏమిటి…

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏ.పి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సైలెంట్ అయిపోయారు. మంత్రి అయిన తొలినాళ్ల నుండి ప్రభుత్వం తరుపున వాకల్తా పుచ్చుకుని ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అటు టిడిపి అధినేత చంద్రబాబుపై తరచూ మీడియా ముందుకు వచ్చి సెటైర్లు వేసే మంత్రి కన్నబాబు ఏమైపోయారనే విషయం చర్చ నీయాంశంగా మారింది. మొన్నటి వరకు విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా రాజధాని ఏర్పాట్లలో బిజీ బిజీ గా ఉన్న మంత్రి కన్నబాబు కరోనా వైరస్ నేపధ్యంలో కేవలం ఇంటికే పరిమితమైపోయారు. కాకినాడ రమణయ్యపేటలో తన స్వగృహంలోనే ఉన్నారు. ఇటు ప్రజలకు, అటు వైసిపి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా బాహ్యప్రపంచానికి దూరంగా గడువుతున్నారు. గోదావరికి రెండు సార్లు వెంట వెంటనే భారీగా వరదలు సంభవించి వేలాది హెక్టార్లలో వరితోపాటు వాణిజ్య పంటలకు అపారనష్టం వాటిల్లింది. ఇటువంటి సమయంలో పంట నష్టపోయిన రైతుల కోసం మంత్రి కన్నబాబు కనీసం పేపర్ ప్రకటన కూడా చేయకపోవడంతో గోదావరి జిల్లాల బాధిత రైతులు అసంతృప్తిగా ఉన్నారు.

విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బిజీబిజీగా ఉన్న కన్నబాబు జిల్లాలోని రాజకీయ వ్యవహారాలను పట్టించుకోవడం లేదని విమర్శలు సైతం ఉన్నాయి. రాజకీయాల్లో మంత్రి కన్నబాబు అంత అదృష్టవంతుడు మరొకరు లేరు అంటున్నారు ఆయన అభిమానులు . రాజకీయాల్లో అడుగు పెట్టిన 10 సంవత్సరాల లోనే రాష్ట్రంలో ముఖ్యమైన నాయకుడిగా ఎదిగారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన కన్నబాబు ప్రజారాజ్యం పార్టీలో గెలిచి తరువాత విలీనంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. కాంగ్రెస్ నుండి వైసిపి లోకి చేరిన వెంటనే తూర్పుగోదావరి పార్టీ జిల్లా వైసిపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పార్టీని విజయపథంలో నడిపించి తాను కాకినాడ రూరల్ నుండి రెండవసారి గెలిచి జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టేశారు.

కాకినాడ రూరల్ వైసిపి శ్రేణులు ఆశించినట్టు గానే జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో వ్యవసాయ శాఖ, సహాకార శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టారు. కన్నబాబు పని తీరుతో రాష్ట్ర క్యాబినెట్ లో ముఖ్య నాయకుడుగా గుర్తింపు పొందారు.వ్యవసాయ శాఖ తో పాటు అనుబంద శాఖలైన హార్టీకల్చర్, గిడ్డంగులు ,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలకు మంత్రిగా ప్రమోషన్ పొందారు. విశాఖ జిల్లా పార్టీ ఇంచార్జీ గాను బాధ్యతలు అప్పగించడంతో బిజీ గా మారిపోవడంతో నియోజకవర్గాన్ని పట్టించుకునే తీరిక లేకుండా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసి ప్రజల అభిమానాన్ని పొందారు. నిత్యం గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించేవారు ఇప్పుడు పరిస్దితి అందుకు భిన్నంగా ఉంది. ఎమ్మెల్యే గా గెలిచి 13 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో పర్యటించలేదు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసచివాలయ వ్యవస్థ ను కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప నుండి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తీసుకు వచ్చారు.

ఇక నియోజకవర్గం బాధ్యతలు కుటుంబ సభ్యులు చూస్తుండడంతో వైసిపి శ్రేణులు అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఎవరూ బయట పడలేక పోతున్నారు. రైతు భరోసా కేంద్రాలను ప్రారంబించినప్పటికి వాటిలో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉండడంలేదు.. నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పోస్టులు తప్ప ఎటువంటి నామినేటెడ్ పోస్టులు ఇప్పటి వరకూ భర్తీ కాలేదు. రైతులు దళారీల చేతిలో మోసపోకుండా గత రబీ సీజన్లో పండిన ధాన్యాన్ని గ్రామ సచివాలయం ద్వారా కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పినప్పటికీ అది ఆచరణ లో విఫలం కావడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు తప్పితే ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

మారిన రాజకీయ పరిణామాలతో మంత్రి కన్నబాబు వెంట తిరిగే కేడర్, సపోర్ట్ గా ఉండే ఎమ్మెల్యేలు ఇప్పుడు రూటు మార్చారు. కొత్తగా మంత్రి పదవి చేపట్టిన చెల్లుబోయిన వేణు వెనుక తిరుగుతున్నారు. వేణు జిల్లా అంతా విస్తృతంగా పర్యటించి వైసిపి కేడర్ ను తన వైపుకు మల్చుకుంటున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేసిన పరిచయాలతో మంత్రి వేణు దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మంత్రి కన్నబాబు తన రూటు మార్చుకుంటారా…. లేక సైలెంట్ గానే ఉండిపోతారో …వేచి చూడాల్సి ఉంది…..