కాంగ్రెస్ పై మరోసారి సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన బిల్యా నాయక్, ఆయన అనుచరులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్.. బిల్యా నాయక్, ఆయన అనుచరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడల్లా గమ్మత్తైన డైలాగులు, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని ధ్వజమెత్తారు.
కేసీఆర్‌తో మాత్రమే గిరిజనులకు న్యాయం జరుగుతదని చెప్పి బీఆర్ఎస్‌లో చేరుతున్నానని బిల్యా నాయక్ చెప్పారని కేటీఆర్ తెలిపారు. ఇవాళ వాస్తవం ఏందంటే.. దశాబ్దాలు కొట్లాడితే పరిష్కారం కాని సమస్యలు మేం అడగక ముందే పరిష్కారం చేశారని బిల్యా నాయక్ అన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. 30 వేల మంది గిరిజన బిడ్డలు.. వార్డు మెంబర్ల నుంచి సర్పంచ్‌ల వరకు ప్రజాప్రతినిధులుగా ఎదిగారు. ఇది మాకు ఒక కానుక అని బిల్యా నాయక్ తెలిపినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఫ్లోరోసిస్‌ను రూపుమాపిన నాయకుడు కేసీఆర్ మాత్రమే అని చెప్పారు. అన్నింటికి మించి గిరిజన జాతికి రిజర్వేషన్లు కల్పించారు. మా తండాలకు త్రీ ఫేజ్ కరెంట్ వస్తుందని బిల్యా చెప్పారు. విద్యా, ఉద్యోగాల్లో 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన మొనగాడు కేసీఆర్ అని ఆయన చెప్పారు. ఇన్ని కారణాల వల్ల బీఆర్ఎస్‌లోకి వస్తున్నాను. రాజకీయంలో కూడా చూసుకోవాలని కాకపోతే ఇన్ని కారణాలు ఉన్నాయని బిల్యా నాయక్ చెప్పారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
రవీంద్ర నాయక్, బిల్యా నాయక్ మంచి మిత్రులమని చెప్పారని కేటీఆర్ తెలిపారు. ఎలక్షన్లప్పుడే తిట్టుకుంటాం తర్వాత మంచిగానే ఉంటామని చెప్పారు. భవిష్యత్‌లో కూడా కలిసే ఉంటాం.. ఇద్దరు నాయకులు కలిసిన తర్వాత.. దేవరకొండ నియోజకవర్గంలో 60 వేల మెజార్టీ రావాలని కేటీఆర్ సూచించారు.