మునుగోడు ఉప ఎన్నికకు ప్రచారం నేటి సాయంత్రంలో ముగియనున్న నేపథ్యంలో.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మునుగోడు ఉప ఎన్నికను ఉద్దేశించి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ప్రజలు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ దమ్మిడి పని కూడా చేయలేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు క్రూరంగా, కిరాతకంగా ప్రవర్తించారు. ఫ్లోరోసిస్ బాధితులను పట్టించుకోలేదన్నారు. రక్షిత మంచినీటి కోసం నిధులు ఇవ్వమంటే కేంద్రం 19 పైసలు కూడా మంజూరు చేయలేదని, జేపీ నడ్డా 300 పడకల ఆస్పత్రి పెడుతానని చెప్పిండని, కానీ నోచుకోలేదన్నారు. శివ్వన్నగూడెం, లక్ష్మాణాపురం ప్రాజెక్టులకు నయా పైసా సహాయం చేయలేదు.
కృష్ణా జలాల్లలో వాటా తేల్చకుండా సతాయిస్తున్నారని ధ్వజమెత్తారు కేటీఆర్. మునుగోడు నియోజకవర్గంలోని నేతన్నలను చావుదెబ్బ కొడుతున్నారన్నారు కేటీఆర్. ప్రధాని మోదీ చేనేతకు మరణ శాసనం రాస్తున్నారు. నేతన్నలను కేసీఆర్ కాపాడుకుంటున్నారు. రైతులను మోదీ పట్టించుకోవట్లేదు. రుణాలు మాఫీ చేయడం లేదు. నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను చావగొట్టారు. రైతు ఆదాయం డబుల్ చేస్తానని చెప్పి, ఇవాళ క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నాడు. కన్నీళ్లు, కష్టాలు, పెట్టుబడి డబుల్ అయిందన్నారు కేటీఆర్. తెలంగాణలో పండిన వడ్లు కొనం కానీ, తెలంగాణ
ఎమ్మెల్యేలను వందల కోట్లతో కొంటామని ఢిల్లీ నుంచి బ్రోకర్లను పంపించారని మండిపడ్డారు కేటీఆర్.