తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో లాక్ డౌన్ పై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఆరోగ్య శాఖ అధికారుల సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ పైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. ఆస్క్ కేటీఆర్ సేషన్ ను నిన్న కేటీఆర్ నిర్వహించారు, ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి విషపూరిత ఎజెండాను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారని.. మా సుపరిపాలన-సుస్థిరతే బిజెపి ద్వేష ప్రచారానికి సరైన సమాధానం అని చెప్పారు.
బిజెపి చేసే అసత్య ప్రచారం మూర్ఖత్వం, దాన్ని వదిలి వేయడమే మంచిదని.. రెండుసార్లు ప్రజలు అవకాశం ఇచ్చినా, అభివృద్ధి చేయలేక పోవడం వల్లనే మతమే ఎజెండాగా బిజెపి మాట్లాడుతుందని వెల్లడించారు. ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయల హామీ ఈ శతాబ్దపు జుమ్లా అని.. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ గెలిచే అవకాశం ఉందని ప్రకటించారు. రేవంత్ రెడ్డి లాంటి నేరస్తులు, 420లతో చర్చకు దిగననని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు క్లారిటీ ఇచ్చారు.