తెలంగాణలో ఇటీవల కురుసిన భారీ వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తెలుగురాష్ట్రాల సరిహద్దులో ఉన్న గ్రామాలను తెలంగానలో విలీనంచేయాలని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించడంతో ఒక్కసారి ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు దిగారు. అయితే.. ఆ తరువాత తన ఉద్దేశ్యాన్ని పువ్వాడ వివరించడంతో.. ఆ విషయం సద్దుమణిగింది. అయితే.. తాజాగా మంత్రి పువ్వాడ ఏపీ సీఎం జగన్‌ను సతీసమేతంగా కలిశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఏపీ రాజధాని పరిధిలోని తాడేపల్లి వెళ్లారు. సతీసమేతంగా తాడేపల్లి వెళ్లిన ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తన ఇంటికి వచ్చిన పువ్వాడ దంపతులకు జగన్ దంపతులు సాదర స్వాగతం పలికారు.
అయితే ఈ భేటీ సంబంధించిన ఫోటోలను మంత్రి పువ్వాడ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. తాడేపల్లికి పువ్వాడ అజయ్ కుమార్ వెళ్లిన కారణం ఏమిటన్న విషయంలోకి వెళితే… ఈ నెల 20న పువ్వాడ అజయ్ కుమారుడి పెళ్లి జరగనుందట. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా అతిథులను పిలిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పువ్వాడ… జగన్‌ను తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు సతీసమేతంగా తాడేపల్లి వెళ్లారు. తన కుమారుడి పెళ్లికి రావాలంటూ ఆయన జగన్ దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం జగన్ నివాసం నుంచి బయటకు వచ్చిన పువ్వాడ… జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో తన తండ్రికి మంచి సంబంధాలుండేవని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో జగన్ తమకు మంచి ఆప్తుడని పేర్కొన్నారు మంత్రి పువ్వాడ.