భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్విసప్తాహ వేడుకలు నిర్వహించేందుకు పూనుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే.. స్వాతంత్య్ర స్ఫూర్తిని అందరికీ తెలిపేలా వాడవాడలా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి, నాగర్ కర్నూలు, జోగుళాంబ గద్వాల జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లతో వజ్రోత్సవ వేడుకలపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో పోరాటంతో దేశానికి స్వాతంత్య్రం లభించిందని, ఈ దేశంలో అందరూ రాజ్యాంగానికి లోబడి పని చేయాలన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమన్నారు. ప్రపంచంలోని పలు దేశాలు మనిషి స్వేచ్ఛ, ఆకాంక్షలకు పెద్దపీట వేస్తున్నాయన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 75 సంవత్సరాల నేపథ్యంలో ప్రభుత్వం ద్విసప్తాహ వేడుకలు నిర్వహిస్తుందన్నారు. 8న హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్ నాయకత్వాన సమావేశం జరుగనున్నదారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని, యువత, మహిళలు, వివిధ శాఖల ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి.