రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా.. రోగులకు మిఠాయిలు, పళ్లు పంపిణి చేస్తున్నారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. అమీర్‌పేటలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. వీరుల త్యాగాల ఫలితంగా స్వేచ్ఛాయుత భారతావని ఏర్పడిందని.. స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ, భగత్ సింగ్, వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులను స్మరించుకోవాలి మంత్రి అన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రేపు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. 15 రోజులపాటు నిర్వహిస్తున్న వేడుకలకు సంబంధించి 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని వెల్లడించారు. దీనికి పెద్దఎత్తున ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ వేడుకల్లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్, శివమణి డ్రమ్స్, దీపికారెడ్డి బృందం నృత్యం, తెలంగాణా జానపద కళా రూపాలు, లేజర్ షో వంటి ప్రదర్శనలు ఉంటాయని వివరించారు.