పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. త్వరలోనే సీఎం జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతారని మంత్రులు తరచూ అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారంగా తొలి అడుగు పడింది. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రుల వసతిపై ప్రభుత్వం కమిటీని నియమించింది. విజయదశమికి విశాఖ వెళ్లిపోతామని సీఎం జగన్ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా ప్రభుత్వ చర్యలు ముమ్మరం అయ్యాయి. విశాఖలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయం, వసతి, మంత్రుల వసతి, సీనియర్ అధికారుల తరలింపు, వసతి గుర్తింపు కోసం అధికారులతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఏర్పాటుపై రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, సాధారణ పరిపాలన శాఖ మానవ వనరుల విభాగం కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.
ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబాటుతనం పొగొట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎస్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల్లో మరింత విస్తృతం చేసేందుకు సీఎం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు క్యాంపు కార్యాలయం ఉత్తరాంధ్రలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉన్నతాధికారులతో తరచూ క్షేత్ర స్థాయి పర్యటనలు, సమీక్షలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. సీఎం జగన్ కూడా తరచూ పర్యటనలు, సమీక్షలు, రాత్రి బస చేస్తారని, ఈ నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని సీఎస్ తెలిపారు.