బంగాల్ లోనూ ‘ఆపరేషన్ షిండే’ : భాజపా నేత మిథున్ చక్రవర్తి

-

ఇటీవలే మహారాష్ట్ర సింహాసనాన్ని చేజిక్కించుకున్న భాజపా కన్ను ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పై పడింది. బంగాల్ లోనూ ఆపరేషన్ షిండే షురూ చేయనున్నట్లు భాజపా నేత, నటుడు మిథున్ చక్రవర్తి అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు భాజపాతో టచ్ లో ఉన్నారని తెలిపారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే వర్గం, భాజపా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరహా పరిస్థితులు.. బంగాల్ లోనూ రావచ్చని మిథున్ జోస్యం చెప్పారు.

“టీఎంసీకి చెందిన కనీసం 38 మంది ఎమ్మెల్యేలు భాజపాతో టచ్ లో ఉన్నారు. వారిలో 21 మంది నాతో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. మహారాష్ట్రలో శివసేన(ఏక్ నాథ్ షిండే వర్గం), భాజపా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయని నేను ముంబయిలో ఉండగా పత్రికలో చదివాను. ప్రస్తుతం భాజపా.. దేశంలోని 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా అతి త్వరలోనే రెపరెపలాడుతుంది. బంగాల్​లో భాజపా తన పోరాటం ఆపదు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహిస్తే.. భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం” అని చెప్పారు మిథున్.

గతేడాది బంగాల్​ శాసనసభ ఎన్నికలకు ముందు భాజపాలో చేరారు మిథున్. ఆ ఎన్నికల్లో టీఎంసీ గెలిచింది. మొత్తం 294 సీట్లున్న బంగాల్​ అసెంబ్లీలో టీఎంసీకి 216 మంది సభ్యులు ఉన్నారు. భాజపా తరఫున 75 మంది గెలిచారు. అయితే.. వీరిలో ఐదుగురు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండానే అధికార పక్షంలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news