బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కు తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఊహించని షాక్ తగిలింది. మియాపూర్ భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యే రఘునందన్ రావు పిల్ పై విచారణ ముగించిన హైకోర్టు.. ఈ తీర్పు ఇచ్చింది. హై కోర్టుకు దర్యాప్తు స్థాయి నివేదిక సమర్పించిన మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్… 24 మందిపై 2018లోనే అభియోగపత్రాలు దాఖలు చేసినట్లు నివేదిక ఇచ్చారు.
పార్థసారథి, పీవీఎస్ శర్మ సహా 11మందిపై హైకోర్టు కేసు కొట్టివేసిందని ఏసీపీ కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. 2019, 2021లో హైకోర్టు కేసులు కొట్టివేసిందని వెల్లడించారు ఏసీపీ కృష్ణ ప్రసాద్. సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని గత నెల 10న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించిన తర్వాత జీవోలు జారీ చేసింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున సీబీఐ దర్యాప్తు అవసరం లేదని తాజాగా హై కోర్టు తీర్పు ఇచ్చింది.