బీజేపీ టూరిస్టులు ఎప్పటిలాగే రాష్ర్టానికి వచ్చి వెళ్లారు : బాల్క సుమన్‌

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొని ప్రసంగించారు. అయితే మోడీ ప్రసంగంపై రాష్ట్ర ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పలు ప్రశ్నలు సంధించారు. బీజేపీ టూరిస్టులు ఎప్పటిలాగే రాష్ర్టానికి వచ్చి వెళ్లారని ఎద్దేవా చేసిన బాల్క సుమన్‌.. ప్రజలు విశ్వసించని మీ విశ్వగురువు (మోదీ) జపానికి, ఉత్త ముచ్చట్లకే పరిమితమైన ఈ సమావేశాలతో మీరు సాధించింది, ఉద్ధరించింది ఏమిటన్నారు. గుజరాతీలకు గులాం గిరీ చేస్తూ బాంచన్‌ దొరా అని పొర్లుదండాలు పెట్టే తెలంగాణ బీజేపీ నేతలు రాష్ర్టానికి రావాల్సిన నిధుల గురించి మోదీని అడగలేక పోయారా? అని, వరదలతో హైదరాబాద్‌ అతలాకుతలమైనప్పుడు ఒక రూపాయి సాయం చేయని మీరు అదే గడ్డపై సమావేశాన్ని పెట్టుకోడానికి సిగ్గు అనిపించలేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Balka Suman - Wikipedia

ఈ సభలు సమావేశాలు మధ్యతరగతి ప్రజలను ముంచినందుకా? లేక దేశాన్ని అదానీ, అంబానీలకు అమ్మేసినందుకా? అని మండిపడ్డారు బాల్క సుమన్‌. సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మోదీ తోక ముడిచి పారిపోయారని, దేశంలో సంపద పెరిగిందా? పేదరికం తగ్గిందా? యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయా? విద్యారంగం బాగుపడిందా? ఉచితంగా వైద్యం అందిస్తున్నారా? ప్రభుత్వ సంస్థలను స్థాపించారా? ప్రైవేట్‌ రంగాన్ని కట్టడి చేయగలిగారా? పెట్రోల్‌, గ్యాస్‌ రేట్లు తగ్గించారా? నిత్యావసర వస్తువుల ధరలను అందుబాటులోకి తెచ్చారా? అని ప్రశ్నలు గుప్పించారు బాల్క సుమన్‌.